1996లో సూపర్ హిట్లో ఫిల్మ్ జర్నలిస్ట్‌గా పని చేసేటప్పుడు ప్రతీ గురువారం సూపర్ హిట్ ప్రింటింగ్‌కి వెళ్లగానే మిగతా స్టాఫ్ రిలాక్స్ అయ్యే వారు. నాకు మాత్రం క్రేజీ వరల్డ్ మంత్లీ మేగజైన్ పని ఉండేది.
క్రేజీ వరల్డ్ విషయానికి వస్తే అప్పట్లో విజయవాడ నుంచి వచ్చే వండర్ వరల్డ్‌కి పోటీగా జయా మేడమ్ మొదలుపెట్టిన మేగజైన్ అది. ఆమెకి ఆ పత్రిక అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అది ఆమె మానస పుత్రిక. సూపర్ హిట్‌ని బి.ఎ. రాజు గారు ప్రధానంగా చూసుకునే వారు. జయా మేడమ్ సూపర్ హిట్ మేనేజ్మెంట్ వ్యవహారాలతో పాటు క్రేజీ వరల్డ్‌ని ఇష్టంగా రూపొందించేవారు.
నేను కర్నూలులో ఓ ఫెర్టిలైజర్స్ ఆఫీసులో అకౌంటెంట్‌గా పనిచేసేటప్పుడు జయా మేడమ్ నాకు ప్రధానంగా లెటర్ రాసిందీ “ఆ క్రేజీ వరల్డ్‌కి సబ్-ఎడిటర్‌గా అవకాశం ఉంది” అన్న విషయం గతంలోనే ప్రస్తావించాను కదా. అయితే కర్నూలు నుండి చెన్నై కి వెళ్ళాక సినిమా జర్నలిస్టుగానూ నన్ను షూటింగులకి పంపేవారు.
క్రేజీవరల్డ్కి ప్రత్యేకంగా ఇంకా స్టాఫ్ ఉండరు. ప్రతీనెలా 48 పేజీలు నేను ఒక్కడినే రాయాలి. జయా మేడమ్ ఒకటి రెండు ఆర్టికల్స్ రాసి ఇచ్చేవారు. అప్పుడే పరిచయమైన సోదరుడు విజయ్ వర్మ గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కాలేజీలను చుట్టి వచ్చి, కోచింగ్ సెంటర్లకు ఆద్యులైన సివిఎన్ ధన్ గారి లాంటి వారి ఇంటర్వ్యూలు చేసుకుని, చెన్నై వచ్చి మేడమ్‌కి ఇచ్చేవారు. మేడమ్ ఆ ఇంటర్వ్యూలను క్రేజీ వరల్డ్‌లో ప్రచురించడానికి నాకు ఇచ్చేది. ఆ తర్వాత వర్మ నాకు ఆత్మీయుడు అవడం జరిగింది. వర్మ ఆర్టికల్స్ గానీ, జయా మేడమ్ ఆర్టికల్స్ గానీ రాకపోతే క్రేజీ వరల్డ్ 48 పేజీలను ప్రతీ నెలా నేనే రాసుకోవాలి. సరిగ్గా ఈ విషయంలో నా జీవితం మలుపు తిరిగింది.
సహజంగా మీరు ఎక్కడైనా పత్రిక ఆఫీసుకి వెళితే ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, టైపిస్ట్, ప్రూఫ్ రీడర్, పేజ్ లేఅవుట్ ఆర్టిస్ట్.. ఇలా కనీసం ఐదు మంది ఉద్యోగులు ఉంటాయి. వీరందరూ కలిసి పనిచేస్తేనే ఓ పత్రిక మన చేతుల్లోకి వస్తుంది. కానీ క్రేజీ వరల్డ్ విషయంలో నేను ఓ కొత్త వరవడిని మొదలుపెట్టాను. అన్ని పనులూ నేనే చేసుకోవడం అనే వరవడి!
అంటే ఆర్టికల్స్ నేనే రాసుకోవడం.. అలా పేపర్ మీద విడిగా రాసుకుని, మళ్లీ టైప్ చేయటం అనవసరమైన సమయం వృధా అని, విడిగా రాసుకోకుండా నేరుగా శ్రీలిపి మాడ్యులర్ లేఅవుట్ ద్వారా పేజ్ మేకర్ 5.0 (అప్పట్లో ఉన్న వెర్షన్)లో టైప్ చేసుకోవడం.. దాని మొత్తాన్ని టైప్ చేసేటప్పుడే జాగ్రత్తగా బ్యాక్ స్పేస్ కొట్టాల్సిన అవసరం రాకుండా పూర్తి కాన్సంట్రేషన్తో టైప్ చెయ్యడం.. ఇంకా అవసరాన్ని బట్టి ఓసారి రఫ్‌గా ప్రూఫ్ రీడ్ చూడడం.. ఆ తర్వాత స్కానర్‌లో సంబంధిత ఫోటోలు స్కాన్ చేసి పేజ్మేకర్లో మూడు కాలమ్స్‌గా విభజించి, మధ్యలో తగినంత గట్టర్ (కాలమ్కీ కాలమ్కీ మధ్యన ఉండే ఖాళీ స్థలం, దీన్ని అప్పట్లో నేను 0.3 మిల్లీమీటర్లు సెట్ చేసే వాడిని) పెట్టి, ప్రతీ కాలమ్ హ్యాండిల్స్‌ని తగిన విధంగా అడ్జెస్ట్ చేసి పేజీని ప్రింటింగ్‌కి సిద్ధంగా చేయడం అలవాటు చేసుకున్నాను.
సహజంగా పేజీలో ఒకటి రెండు లైన్లు తగ్గితే, చాలామంది టైపిస్టులు ఒక పేరా మొత్తాన్నీ సెలెక్ట్ చేసుకుని కొద్దిగా ఫాంట్ సైజు పెంచి పేజీని అడ్జెస్ట్ చేసేవారు. దానివల్ల పాఠకులకు పేజీ చూడడానికి చిన్న, పెద్ద అక్షరాల సముదాయంతో ఎగుడుదిగుడుగా ఉంటుంది. ఇప్పుడు రాసేదీ నేనే, టైప్ చేసేదీ నేనే కాబట్టి నేను దానికి భిన్నంగా అప్పటికప్పుడు అదనంగా ఒకటి రెండు లైన్లు టైప్ చేసేవాడిని. పత్రికా రంగంలో ఉన్న వారికి ఈ విషయాలు చాలా సులభంగా అర్థం అవుతాయి. అప్పటి జ్ఞాపకాలు ఎంత సజీవంగా ఉన్నాయంటే క్రేజీ వరల్డ్ కోసం నేను SREE910 ఫాంట్ వాడేవాడిని. ఫాంట్ సైజ్ 11. ఇంకా ఎక్కువ మేటర్ పట్టించాలంటే 10కి ఫాంట్ సైజ్ కుదించి పేజీ నిండా కావలసినంత మ్యాటర్ రాసేవాడిని.
ఇదంతా ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే.. మన రంగంలో అన్ని పనులూ మనం చేసుకోగలిగితే అప్పుడు లభించే స్వేచ్ఛ మాటల్లో వర్ణించలేనిది. ఇతర ఉద్యోగుల మీద ఆధారపడడం తగ్గిపోతుంది. దానిని నేను 1996లోనే అనుభవించాను. అప్పటి నుండి ఈ రోజు వరకు నేను ఏ పనిచేసినా ఇతరుల మీద ఆధారపడడం అంటూ ఏదీ ఉండదు. నాకు రానిదైతే నేర్చుకుని దాని అంతు తేలవడమే!
2001లో కంప్యూటర్ ఎరా పత్రిక మొదలుపెట్టినప్పుడు ఇది నాకు బాగా ఉపయోగపడింది.
అప్పట్లో విజేత కాంపిటీషన్స్ బండ్ల సాయిబాబు గారు “మీరు ఆర్టికల్స్ రాసి మన ఆఫీసుకి తీసుకు రండి.. మన టైపిస్టుల చేత టైప్ చేయించి పత్రిక తయారు చేద్దాం” అన్నారు.
“లేదు సర్, నా దగ్గర కంప్యూటర్ ఉంది, నేనే మొత్తం డిజైన్ చేసి నెలకి ఓసారి ఆఫీసుకి వచ్చి ప్రింటింగ్‌కి పంపిద్దాం” అన్నాను. అలా కంప్యూటర్ ఎరా 2001 నుండి 2020 వరకూ 19 సంవత్సరాల పాటు ప్రతీ నెలా మొదట్లో 56 పేజీలు, ఆ తర్వాత 48 పేజీలు నేను ఒక్కడినే మనస్సులో టాపిక్ అనుకోవడం, దాన్ని ఓ అర్థవంతమైన క్రమంలో టైప్ చేసుకుంటూ వెళ్లడం, పేజ్ డిజైన్ చేసి ప్రింటింగ్‌కి ఇవ్వడం జరిగేది.
2001 అక్టోబర్ నుండి “కంప్యూటర్ ఎరా” మొదలైంది. అక్టోబర్ సంచికను ప్రింటింగ్‌కి పంపేటప్పుడు జరిగిన ఓ సంఘటన చెబుతాను. నేను తయారుచేసిన పత్రిక పేజ్మేకర్ ఫైల్ మొత్తం 230 ఎంబి వరకూ సైజ్ వచ్చింది. నేను అప్పట్లో సారధి స్టూడియోస్ దాటి ముందుకు వెళితే యూసఫ్ గూడ బస్తీ దగ్గర ఉండే మధురా నగర్లో ఉండేవాడిని. అప్పట్లో 56 కెబిపియస్ టాటా టెలికం ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే వాడేవాడిని. అలాగే మా విజేత ఆఫీసులో ఎవరికీ కనీసం మెయిల్ అకౌంట్లు లేవు. పెద్ద ఫైళ్లు పంపడానికి ఇప్పుడు ఉన్నట్లు ఫైల్ షేరింగ్ సైట్లు గానీ, గూగుల్ డ్రైవ్ వంటివి గానీ లేవు. నా కంప్యూటర్లో సిడి రైటర్ లేదు. కేవలం సిడి డ్రైవ్ మాత్రమే ఉండేది.
ఇంకేం చేయాలి. స్వంత వెహికిల్ కూడా లేదు. యూసఫ్ గూడ బస్తీకి ఓ మూలన ఐదారు ఆటోలు ఉండేవి. అందులో సత్యనారాయణ అని ఓ ఆటో డ్రైవర్ నాకు బాగా పరిచయం. ఆయనతో ఆటో మాట్లాడుకుని కంప్యూటర్ క్యాబినెట్ (వైట్ కలర్ కేస్‌తో భలే ఉండేది. ఆ ఫీల్ నాకు ఇప్పటికీ అలా సజీవంగా ఉంది) వెనుక మోనిటర్, కీబోర్డ్, మౌస్ వంటి కేబుల్స్ అన్నీ తొలగించి ఆటోలో పెట్టుకుని అమీర్‌పేట, ట్యాంక్ బండ్ మీదుగా, ఆర్టిసి క్రాస్ రోడ్స్ మీదుగా నల్లకుంట తీసుకు వెళ్లాను.
విజేత కాంపిటీషన్స్ ఆఫీసు అంబుజా కాంప్లెక్స్ అనే ఓ ఆపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లోరంతా ఉండేది. అక్కడికి వెళ్లాక సాయిబాబు గారు రంగయ్య అనే టైపిస్ట్‌ని నాకు అనుసంధానించారు. అక్కడ నా కంప్యూటర్ కనెక్ట్ చెయ్యగానే మదర్ బోర్డ్ మీద పొగలు వచ్చాయి. అక్కడ ఓల్టేజ్‌లో ఏదో తేడా ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి నా కంప్యూటర్ మదర్ బోర్డ్ కాలిపోయింది. మనస్సులో అదో దిగులు.. ఇప్పుడు ఎంత ఖర్చవుతుందో అని! సరే అప్పటికప్పుడు ప్రింటింగ్ ముఖ్యం కాబట్టి, హార్డ్ డిస్క్‌ని పీకేసి, దాన్ని పట్టుకుని నేను స్వామి అనే మరో టైపిస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్‌కి తీసుకెళ్లాం.
అప్పట్లోనే కళాజ్యోతి ప్రెస్ కార్పొరేట్ ఆఫీసు స్థాయిలో ఉండేది. మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేడు. కూర్చోమన్నారు, ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు. మధ్యాహ్నం వెళితే రాత్రి ఏడైంది, మా దగ్గరకు ఓ ఉద్యోగి వచ్చేసరికి! వాళ్ల కంప్యూటర్‌కి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి, నేను తీసుకెళ్లిన పేజ్మేకర్ 5.0 pmd ఫైల్ని వారి దగ్గర ఉన్న అడోబ్ ఆక్రోబాట్ ప్రింటర్ డ్రైవర్ ద్వారా పిఎస్ ఫైల్‌గా మార్చి, దాన్ని అక్రోబాట్ రీడర్‌తో డిస్టిల్ చేసి చివరకు పిడిఎఫ్‌గా మార్చారు. అప్పటివరకు ఒక సాధారణ ఫైల్ని పిడిఎఫ్ ఎలా చేయాలో నాకు తెలీదు. ఇప్పుడంటే టెక్నాలజీ సులభతరం అయి ఎవరికీ ఏమీ తెలీకపోయినా ఇవన్నీ ఈజీగా చెయ్యగలుగుతున్నారు గానీ అప్పట్లో చెప్పేవాళ్లు ఉండరు, సెల్ఫోన్లు లేవు, మెయిల్ ఐడిలు వాడేవారు కాదు. 2004లో జీమెయిల్ మొదలైంది. 2001లో నేను యాహూ మెయిల్ వాడే వాడిని. నాకు తప్పించి నా సర్కిల్లో ఎవరికీ ఉండేది కాదు.
అతను పిడిఎఫ్ తయారు చేస్తుంటే నేను పెన్ను పేపర్ తీసుకుని వేగంగా ప్రొసీజర్ రాసుకున్నాను. అతను నా వైపు విచిత్రంగా చూశాడు. నాకు మళ్లీ ఇంకో వ్యక్తి మీద ఆధారపడడం ఇష్టం ఉండదని ఇంతకు ముందే చెప్పాను కదా! ఎంత క్లిష్టమైన సబ్జెక్ట్ అయినా నాకు సెల్ఫ్ లెర్నింగ్, నాకు నేను ప్రయోగాలు చేసుకుని నేర్చుకోవడం ఇష్టం. ఇదే విషయం ఇప్పుడు నేను రాస్తున్న మెడిటేషన్ విషయానికీ వర్తిస్తుంది. నాకు మెడిటేషన్ విషయంలో ఏ గురువూ లేరు. ఏ పుస్తకాలు చదివీ నేర్చుకున్నది కాదు. ఏళ్ల తరబడి పట్టుదలగా చేస్తూ నన్ను నేను సరిచేసుకుంటూ సాధించిన స్థితి ఇది.
అసలు విషయానికి వస్తే, అలా “కంప్యూటర్ ఎరా” తొలి సంచిక నా మదర్ బోర్డ్ కాలిపోయి మరీ ప్రింటింగ్‌కి వెళ్లింది. 2001 సెప్టెంబర్ 20న అక్టోబర్ సంచిక ప్రింట్ అయి వస్తే దాన్ని చేతుల్లోకి మురిపెంగా చూసుకుని ఎంతగా సంతోషపడ్డానో! అది నా బ్రెయిన్ ఛైల్డ్. “కంప్యూటర్ ఎరా” ప్రయాణం గురించి తర్వాత వివరంగా చెబుతాను.
నేను చెన్నై క్రేజీ వరల్డ్‌లో అలవరుచుకున్న విధానం నాకు ఈరోజు వరకూ జీవితాంతం ఉపయోగపడింది. “అన్ని పనులూ మనమే చేసుకోవాలి, ఇతరుల మీద ఆధారపడకూడదు” అనేది. కంప్యూటర్ ఎరా పత్రికను మార్చి 2020 వరకూ 19 సంవత్సరాలు ఒక్కడినే తయారు చేశాను. ఇప్పుడంటే వాయిస్ టైపింగ్ వచ్చింది గానీ 48 పేజీలు టైప్ చేస్తుంటే వేళ్లు విపరీతంగా నొప్పి పుట్టేవి. కొన్నిసార్లు ఊరెళ్లాల్సిన పెళ్లిళ్లు గానీ, నా ఆరోగ్యం బాలేక గానీ నెల మొత్తంలో ఎక్కువ రోజులు వృధా అయితే కేవలం ఐదారు రోజుల్లో 48 పేజీలు రాసేవాడిని.
ప్రతీ పత్రికకు ప్రింటింగ్‌కి ఓ డెడ్‌లైన్ ఉంటుంది. మాకు ప్రతీనెలా 23వ తేదీ. నా జీవితంలో 23వ తేదీ అలా గుర్తుండి పోతుంది. వారం రోజుల్లో మేగజైన్ రాయగలను అనే నమ్మకం వచ్చింది కాబట్టి 15వ తేదీ నుండి 23వ తేదీ మధ్య ఎంత బంధువులు పెళ్లిళ్లు ఉన్నా, ఇంకేమీ ఉన్నా అటెండ్ అయ్యే వాడిని కాదు. దీనివల్ల బంధువుల్లో మనస్పర్ధలు వచ్చిన సంఘటనలు అనేకం. వారం రోజుల్లో మ్యాగజైన్ 48 పేజీలు రాసేటప్పుడు ఒక ప్రధానమైన సమస్య ఏర్పడేది. నేను వారం రోజుల్లో టైప్ చెయ్యగలను, రాయగలను అన్న నమ్మకం నాకు ఉంది, కారణం అప్పటికే పలుసార్లు రాయగలిగాను కాబట్టి! కానీ ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ అలా గంటల తరబడి కూర్చుని అనూ మాడ్యులర్ కీబోర్డ్‌లో ఒక్కో తెలుగు అక్షరం రావడానికి రెండు మూడు కీలను కీబోర్డ్ నుండి వత్తుతూ టైప్ చేసేటప్పుడు ఎంతో మానసిక వత్తిడి ఏర్పడేది.
ఓ పక్క ఏ టాపిక్ రాయాలి అన్నది నిర్ణయించుకోవడం, అలాగే దాన్ని అందంగా డిజైన్ చేసుకోవడం, ఈరోజుకి ఎన్ని పేజీలు పూర్తి చెయ్యగలను అని మధ్యలో అంచనా వేసుకుంటూ వేగాన్ని పెంచుకోవడం.. ఈ వేగం పెరిగేటప్పుడు వేళ్లపై వత్తిడి పడుతూ తప్పులు పడడం.. దీనివల్ల మళ్లీ మానసిక వత్తిడి ఏర్పడడం.. కొన్నిసార్లయితే ఊపిరి కూడా అందనంగా వత్తిడికి గురయ్యేవాడిని. ఇవన్నీ పత్రికను చదివే పాఠకుడికి తెలీవు. ఇలా ఇంత శ్రమతో ఏకంగా 19 సంవత్సరాల పాటు పత్రికను ఒంటిచేత్తో నడిపాను.
2016 సమయంలో గిన్నిస్‌బుక్‌లో వెదికాను.. ప్రపంచంలో ఎక్కడైనా ఒకే వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు పత్రికను రూపొందించారా అని! గిన్నిస్ బుక్‌లో ఎక్కడా అలాంటి రికార్డ్ లేదు. అప్లై చేద్దామని మా పత్రికాఫీసులో ఉన్న 2001 నుండి పత్రికలన్నీ సేకరించాను. మా ఆఫీసుకి పాత సంచికలు అవసరం అయిన వాళ్లకు విక్రయించే అలవాటు ఉండేది. దాంతో గోడౌన్లో కొన్ని పత్రికలు కనీసం స్టాక్ లేవు. మరో పక్క అప్పటికి 15 ఏళ్లలో అనేకసార్లు కంప్యూటర్లు మార్చడం వల్ల హార్డ్ డిస్కులలో కూడా అన్ని కాపీలు లేవు. సో అన్నేళ్లు కష్టపడి రికార్డ్ సృష్టించి కూడా అలా వదిలేశాను. నిజంగా అన్నీ అనుకూలించి ఉంటే నల్లమోతు శ్రీధర్ పేరిట ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్ ఉండేది.
ఒకటే చెబుతున్నాను.. కష్టపడడం నా నైజం… కర్మయోగిలా నేర్చుకోవడం, కష్టపడడమే నాకు నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకూ జరుగుతుంది. ఆ కష్టాన్ని ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా అది నా జీవితంలో ఓ భాగమైపోయింది. ఈ భూమ్మీద ఎందుకు ఉన్నానో నాకు తెలీదు.. కానీ నాదైన ముద్రని ప్రతీ క్షణం ప్రతీ రంగంలో వేస్తూనే ఉంటాను. అలాగే ఈ ప్రపంచం నుండి విడిపడి నాదైన ఆధ్యాత్మిక ప్రపంచంలో నా సోల్‌ని తెలుసుకుంటూ పయనిస్తూనే ఉంటాను.
మరో భాగంతో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu