అనేక మంది తరచూ అడిగే ప్రశ్న.. “టెక్నాలజీలో మీరు ఏం కోర్సు చేశారు ఈ స్థాయికి రావడానికి” అని! అప్పుడెప్పుడో 5.25 అంగుళాల ఫ్లాపీ డిస్క్‌ల సమయంలో 1993లో బాపట్ల పటేల్ నగర్లో రెండు నెలల పాటు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయి “సి” లాంగ్వేజ్ నేర్చుకున్నది తప్పించి నా జీవితంలో మరెప్పుడూ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో అడుగుపెట్టలేదు. అలాగే ఎవరి దగ్గరా ఒక్క ముక్క నేర్చుకున్నదీ లేదు. స్వయంగా పరిశీలిస్తూ నేర్చుకున్న నాలెడ్జ్‌నే ఇన్నేళ్లపాటు గడించినది!
1996లో క్రేజీ వరల్డ్‌లో ఉన్నప్పుడు జయా మేడమ్ ఓరోజు పిలిచి, ఎదురుగా కుర్చీలో కూర్చోమన్నారు. ఆమె అలా కూర్చోమన్నారంటే కొద్దిగా భయపడాలి, లేదా సంతోషపడాలి. ఆమెకి కోపమెక్కువ. అలాగే అంతే ప్రేమగానూ ఉంటారు. ఎలాంటి భావం కన్పించకుండా మేడమ్ ముందు కూర్చున్నాను.
“క్రేజీ వరల్డ్”లో “కంప్యూటర్ వరల్డ్” అని ఓ సప్లిమెంట్ మొదలుపెడదాం. 32 పేజీలు రాయాలి. నీకు కంప్యూటర్స్ వచ్చా” అని అడిగారు. “లేదు మేడమ్, సి లాంగ్వేజ్ కొద్దిగా తప్పించి రాదు” అన్నాను.
“సరే ట్రై చేద్దాం, మధ్యాహ్నం లాండ్మార్క్ బుక్‌షాపుకి వెళదాం” అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఏవో నాలుగైదు బుక్స్ కొని చేతికిచ్చారు. పేజీలు తిరగేస్తే ఒక్క ముక్క అర్థం కావట్లేదు. “వీటిని ట్రాన్స్‌లేట్ చేసి రాయి” అన్నారు. నాకు మనసొప్పలేదు. అర్థం కాని దాన్ని ఏదో అతుకుల బొంతగా అర్థం చేసుకుని వచ్చినట్లు రాయడం నాకు అస్సలు మనస్కరించలేదు. “సరే” అన్నాను గానీ నాకు ఇంకో స్ట్రేటజీ ఉంది. వచ్చే నెల నుండి మొదలుపెడదాం అని ఆమె అన్నారు కాబట్టి నా చేతిలో నెలరోజుల టైమ్ ఉంది.
ఆఫీసుకి రాగానే కంప్యూటర్ ఆన్ చేశాను. విండోస్ 95 వాడుతున్నాం ఆ సిస్టమ్‌లో! MS Word, Paint, Notepad ఒక్కొకటిగా ఓపెన్ చేసి ఒక్కో మెనూ చదువుకుంటూ వెళ్లాను. ఒక్కో ఆప్షన్ తెలుసుకుంటూ, స్క్రీన్‌పై వచ్చే డైలాగ్ బాక్స్‌లు స్టడీ చేశాను. ఇప్పట్లా ఇంటర్నెట్ లేదు. డయలప్ కనెక్షన్ ద్వారా ఒకటి రెండు పేజీలు ఓపెన్ చేసినా అందులో ఊరికే ఆ కంపెనీల పేర్లు, వారి సేవల వివరాలే ఉండేవి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడా ఉండేది కాదు. దీంతో నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా విండోస్‌లో ఉన్న అన్ని ఆప్షన్లు చివరకు డాస్ కమాండ్ ప్రామ్ట్ నుండి పార్టీషన్ చెయ్యడం వంటి బయటకు ఎవరికీ కన్పించని ఆప్షన్లని కూడా తెలుసుకున్నాను.
జయా మేడమ్ చెప్పినట్లు “కంప్యూటర్ వరల్డ్” సప్లిమెంట్ మొదలుపెట్టగలను అన్న నమ్మకం కలిగింది. దాంతో పాటే మా ఆఫీసులో కంప్యూటర్లు రిపేర్ చెయ్యడానికి హార్డ్‌వేర్ వాళ్లు వచ్చేవాళ్లు. వాళ్లు నేల మీద కూర్చుని కాబినెట్ విప్పదీసి మదర్బోర్డ్ మీద జంపర్ సెట్టింగులు అవి చేస్తుంటే వారి పక్కనే బాసంపట్ల వేసి కూర్చుని “హార్డ్ డిస్క్ ఎక్కడ, ర్యామ్ ఎక్కడ” అని అడిగే వాడిని. అప్పట్లో మదర్ బోర్డ్ మీద భారీ మొత్తంలో ట్రాన్సిస్టర్లు ఉండేవి. వాళ్లు వచ్చినప్పుడల్లా ఎల్పిటి పోర్ట్ మొదలుకుని, బయాస్ చిప్ వరకూ అన్ని హార్డ్‌వేర్ భాగాల గురించి, వాటి పనితీరు గురించి వారిని అడిగి తెలుసుకునే వాడిని.
ఇలా అటు విండోస్ ఫీచర్లు, ఇటు హార్డ్‌వేర్ సమాచారంతో “కంప్యూటర్ వరల్డ్” మే 2006లో మొదలైంది. అలా తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యానికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా చరిత్రలో నాకు స్థానం లభించింది. అప్పటివరకు కంప్యూటర్ మీద ఒక్క అక్షరం కూడా ఎక్కడా తెలుగు సాహిత్యంలో రాయబడి లేదు. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి తెలుసుకునే వాడిని. తెలుసుకున్నది మేగజైన్లో రాసే వాడిని. 1999లో పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ వారు హైదరాబాద్‌లో మొదలుపెట్టిన “కంప్యూటర్ వరల్డ్” పత్రికకీ, 2001 నుండి 2020 వరకూ 19 సంవత్సరాల పాటు నేను నిర్వహించిన “కంప్యూటర్ ఎరా” పత్రికకూ ఈ నిరంతరం నేర్చుకునే స్వభావమే బాగా ఉపయోగపడింది.
ఏళ్లు గడిచే కొద్దీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక 2003 నుండి విపరీతంగా నేర్చుకోవడం మొదలు పెట్టాను. 2003 నాటికి నాకు స్వంతంగా కంప్యూటర్ ఉండేది. ఖాళీగా ఉన్నప్పుడల్లా విప్పదీసి జంపర్స్ మారుస్తూ, కనెక్టర్లు మారుస్తూ ప్రయోగాలు చేసేవాడిని. అలా తెలుసుకున్న ఫలితాలను అప్పట్లో నా దగ్గర ఉన్న సోనీ ఎరిక్సన్ P900 మొట్టమొదటి టచ్ స్క్రీన్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసి కంప్యూటర్లోకి కాపీ చేసుకుని ఆ ఫొటోలను పేజ్మేకర్లో అమర్చుకుని “హార్డ్ వేర్ నేర్చుకుందాం” అనే కాలమ్ రన్ చేశాను. అలాగే మల్టీమీడియా కూడా! మాయా సాఫ్ట్వేర్, త్రీడీ స్టూడియో మాక్స్ వంటి వాటిలో మోడల్స్ క్రియేట్ చేసేవాడిని. కోరల్ డ్రాలో లోగోలు డిజైనింగ్ చేసేవాడిని. ఆ ఆప్షన్స్ అన్నీ చూపిస్తూ “మల్టీమీడియా క్లాస్ రూమ్” అని ఓ కాలమ్ రన్ చేశాను.
2006 ఫిబ్రవరిలో మధురానగర్ నుండి కూకట్పల్లి మారిపోయాను. ఇక్కడ మొదట్లో ఆర్విఆర్ నెట్ అని 3 ఎంబీపిఎస్ కనెక్షన్ ఉండేది. అప్పట్లో హ్యాకింగ్ మీద కవర్ స్టోరీ పది పేజీలు రాయాలని రకరకాల టూల్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రయోగాలు మొదలుపెట్టాను. ఆర్విఆర్ నెట్‌ని మా చుట్టూ చాలామంది వాడే వారు. అంతా ల్యాన్లో కనెక్ట్ అయి ఉండేవి. కొన్ని టూల్స్ ఉపయోగించి పాకెట్ స్నిఫింగ్ చేసి చుట్టూ ఉన్న వాళ్లు యాహూ ఛాట్ రూముల్లో అమ్మాయిలతో చేసే పనికిమాలిన సంభాషణలు తెలుసుకునే వాడిని. వాటిని బ్లర్ చేసి మేగజైన్లో పాకెట్ స్నిఫర్లు ఇలా పనిచేస్తాయి అని 2007లో హాకింగ్ మీద కవర్ స్టోరీలో రాశాను. పాత పత్రికలు ఉంటే ఎవరైనా దాన్ని రిఫర్ చేయొచ్చు.
ఓ కీలాగర్ని ఓ ఇమేజ్‌లో బైండ్ చేసి, వారి బ్యాంక్ సమాచారం తెలుసుకుని ఆ స్క్రీన్ షాట్ పెట్టి బ్యాంక్ అకౌంట్‌తో జాగ్రత్త అని మేగజైన్లో అప్రమ్తతం చేశాను. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఇన్నేళ్లలో నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, మీడియా ద్వారా అవగాహన కల్పించడానికి, పోలీసులకి ట్రైనింగ్ ఇవ్వడానికి చేసిన హ్యాకింగ్ రియల్ టైమ్ ప్రయత్నాలన్నీ ఏరోజూ దుర్వినియోగం చెయ్యలేదు.
ఇలా ప్రతీదీ ప్రయోగాత్మకంగా ఉపయోగించడం, ఆ స్క్రీన్ షాట్లతో మేగజైన్ మొత్తం 48 పేజీలు రాయడం ఇలాగే “కంప్యూటర్ ఎరా” నడిచింది. నేను ఒకటే బలంగా నమ్ముతాను. జీవితాంతం నేర్చుకోవడం ఆగకూడదు. చాలామంది జీవితంలో ఒక స్థితికి వచ్చాక నేర్చుకోవడం ఆపేస్తారు. నా దృష్టిలో అలా ఆపేస్తే మైండ్ మురికి కూపంలా తయారవుతుంది.
సిస్టమ్ బస్‌లో IRQ రిక్వెస్టులు మొదలుకుని, విండోస్ రిజిస్ట్రీలో లక్షలాది సెట్టింగ్స్ మొదలుకుని, బయాస్ సెట్టింగ్స్, ప్రాసెసర్ క్యాఛే పనితీరు, మల్టీమీడియాలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్టులను డిజైన్ చెయ్యడం, సైబర్ సెక్యూరిటీలో కీలాగర్, రూట్కిట్, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ డెవలప్ చెయ్యడం, ఫిషింగ్ అటాక్ రూపొందించడం, క్రిప్టోగ్రఫీలో పాస్వర్డ్ హాషింగ్, సాల్టింగ్ వంటి అడ్వాన్డ్డ్ టెక్నిక్స్, డార్క్ వెబ్ ఫోరమ్స్‌లో అంతర్జాతీయ హ్యాకర్లతో చర్చలు, ఆండ్రాయిడ్, ఐ ఓయస్ హాకింగ్, రూటింగ్, జైల్ బ్రేకింగ్, ఎస్క్యూయఎల్ డేటాబేస్లు, వెబ్ అటాక్స్, వెబ్సైట్లు రూపొందించడం, వర్డ్‌ప్రెస్, అపాచీ సర్వర్, మెయిల్ సర్వర్ కాన్ఫిగర్ చెయ్యడం, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో బల్క్ మెయిల్ సర్వీసెస్ కాన్ఫిగర్ చెయ్యడం, మెషీల్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్స్, ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ, అపెర్చర్ నుండి HDR వరకూ అన్ని సెట్టింగ్స్ ఎఫెక్టివ్‌గా వాడడానికి వేలాది ఫొటోలు తీసి అనేక ప్రయోగాలు, వీడియో ఎడిటింగ్, అడోబ్ ప్రీమియర్ లోతుగా వాడడం.. ఇవే కాకుండా కొన్ని వందల టాపిక్స్ మీద ఇప్పటికిప్పుడు నేను వర్క్ చెయ్యగలను, గంటల తరబడి మాట్లాడగలను. అకౌంటెన్సీ ICWAI చదివిన నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చాను.
TV9, NTV, ABN, TV5 మూర్తి గారు వంటి అందరి ఫోన్లని లైవ్‌లో అప్పటికప్పుడు హ్యాక్ చేశాను డెమో కోసం! ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్నాటక, ఒరిస్సా వంటి రాష్ట్రాల పోలీసులకి సైబర్ నేరాల ఇన్వెస్టిగేషన్ గురించి తరచూ ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆంధ్ర, తెలంగాణ CID తరఫున ట్రైనింగ్ ఇస్తుంటాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీస్ స్టేషన్లలో కీలకమైన కేసుల ఇన్వెస్టిగేషన్ గురించి అక్కడి స్థానిక పోలీసులు తరచూ కాల్ చేసి సలహాలు, సపోర్ట్ తీసుకుంటారు. అలాగే అన్ని తెలుగు టీవీ ఛానళ్లలో సిఇఓ లాంటి ప్రముఖుల నుండి యాంకర్లు మొదలుకుని, పిసిఆర్లో పనిచేసే ఉద్యోగుల వరకూ అందరూ రోజుకి ఓ ఐదారుగురైనా మెసేజ్ చేస్తుంటారు.. తమ సాంకేతిక సందేహాలకు!
ఆఫ్టరాల్ ఓ కామర్స్ గ్రాడ్యుయేట్ ని!.. ICWAI లాంటి సంబంధం లేని డొమైన్ నుండి వచ్చిన వ్యక్తిని కేవలం పాషన్‌తో సాధించిన విజయం ఇది. ఓ ఫ్రేమ్డ్వర్క్లో డేటా సైంటిస్ట్ అనీ, జావా అనీ, డాట్ నెట్ అనీ ఓ క్లోజ్డ్ ప్రొఫైల్‌లో జీవితాంతం పనిచేసే అనేకమంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే లోతైన అవగాహన ఏర్పరుచుకున్నాను. టెక్నాలజీకి సంబంధించి ఏ సబ్జెక్ట్‌నైనా డీల్ చెయ్యగలుగుతాను. ఇది కేవలం తపన కొద్దీనే సాధించిన విజయం.
ఇప్పుడు చెప్పండి.. ఎన్ని సర్టిఫికెట్లు ఇవ్వగలరు నా 26 ఏళ్ల నాలెడ్జ్‌కి? ఏ యూనివర్శిటీలు నేర్పించగలవు ఇంత విస్తృతమైన నాలెడ్జ్‌ని! ఒక మనిషి విద్యార్హతలు, పక్కన కన్పించే డిగ్రీలను చూసి గౌరవించే సమాజం ఉన్నంత కాలం నిజమైన విద్యకి, ఒక వ్యక్తిలోని పాషన్కీ విలువ లేకుండా పోతుంది. ఈరోజు “కంప్యూటర్ ఎరా”ని చదివి మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అనేక కంపెనీల్లో పదేళ్లకి పైగా అనుభవం గడించిన వారున్నారు. నా మెయిల్ 2005 నుండి ఇప్పటి వరకూ చూసుకుంటూ వెళితే “మీరు నా భవిష్యత్‌ని నిర్మించారు కంప్యూటర్ ఎరా ద్వారా” అనే వేలాది మెయిల్స్ నిండిపోయి ఉన్నాయి.
చివరిగా నేను ఒక్కటే నమ్ముతాను.. ఓ డిగ్రీ నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు. పక్కన తగిలించుకుని పొంగిపోవడానికీ, జనాలకు గర్వంగా చూపించుకోవడానికీ, నేను ప్రొఫెషనల్‌ని అని గొప్పలు చెప్పుకోవడానికి తప్పించి! గుండెల్లో దమ్ముండాలి. నేర్చుకునే తపనుండాలి. ఏ సబ్జెక్ట్ అయినా అంతు తేల్చే దృఢ సంకల్పం ఉండాలి. చెబుతున్నా రాసిపెట్టుకోండి.. నేను ఏ నేర్చుకుంటున్నా, ఏ రంగంలోకి అడుగుపెట్టినా దాని అంతుతేల్చేదాకా వదిలిపెట్టను. అబ్ధుల్ కలాం లాంటి మెంటాలిటీ నాది. తుది శ్వాస వరకూ నేర్చుకుంటూనే ఉంటాను, నేర్పిస్తూనే ఉంటాను.
మరో భాగంతో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu