“నేను వచ్చేదాకా ప్రింటింగ్‌కి పంపకండి” అంటూ బి.ఎ. రాజు గారి నుండి కాల్ వచ్చేది. మొబైల్స్ లేవు కాబట్టి సహజంగా ల్యాండ్లైన్కే వచ్చేది అది! అప్పటికే సమయం రాత్రి 11 అయి ఉండేది.
ఆయన ఎక్కడ ఉన్నారో తెలీదు, ఎప్పుడొస్తారో తెలీదు. ఓ పక్కన పబ్లిసిటీ ఆర్టిస్ట్, టి.నగర్లో నా రూమ్మేట్ రాంబాబు బయట వెడల్పాటి టేబుల్ మీద టాబ్లాయిడ్ సైజ్ ఉండే వైట్ షీట్ మీద టైప్ చేసి ప్రింట్ తీసిన ఆర్టికల్స్‌ని అంచుల వరకూ కట్ చేసి పేజ్ అరేంజ్ చేసేవాడు. ఇప్పట్లా నేరుగా పేజీని ప్రెస్‌కి ప్రింటింగ్‌కి పంపే టెక్నాలజీ అంతగా రాలేదు.
అలా మేము టాబ్లాయిడ్ సైజ్ పేజీలు సిద్ధం చేసి ఇస్తే శివ అనే ఓ ఆఫీస్ బాయ్ ప్రముఖ తమిళ నటుడు టి. రాజేందర్‌కి చెందిన ప్రింటింగ్ ప్రెస్‌కి తీసుకెళ్లేవాడు. అక్కడ నెగిటివ్స్ తయారు చెయ్యడం, వాటితో ప్లేట్స్ సిద్దం చేయడం, ఆ తర్వాత అందంగా రంగు రంగులతో “సూపర్ హిట్” పత్రిక సిద్ధం కావడం జరిగేది. ఒకటి రెండుసార్లు ప్లేట్స్ విషయంలో ఏదో ఇబ్బంది తలెత్తితే నేనూ ప్రెస్‌కి వెళ్లి నేను చేసిన సినిమా ఇంటర్వ్యూలు మెషీన్ ద్వారా ప్రింట్ అవుతుంటే స్వయంగా అపురూపంగా చూసుకున్న జ్ఞాపకాలు ఇప్పటికీ సజీవం.
సరే బి.ఎ. రాజు గారి రాకకోసం నేనూ, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, రాంబాబూ వెయిట్ చేస్తూ కూర్చునే వాళ్లం. రాజు గారిలో ఉండే గొప్ప లక్షణం, ఆయన బాలకృష్ణ, మహేష్‌బాబు వంటి ఎందరో పెద్ద పెద్ద హీరోలకి పర్సనల్ పిఆర్ఓగా మారడానికి దారితీసిన అంశం వృత్తిపట్ల ఆయన కమిట్మెంట్.
చెన్నై కోడంబాక్కంలో మా ఆఫీసు క్రింద గ్రీన్ కలర్లో ఓ ప్రైవేట్ ఆటో ఉండేది. గ్రీన్ మీద యెల్లో లైన్స్ ఉంటాయి. రాజు గారు మధ్యాహ్నం వరకూ ఆఫీసులో కూర్చుని మధ్యాహ్నం తర్వాత ఆటో డ్రైవర్ని తీసుకుని సినిమా ఆఫీసులకి వెళ్లిపోయేవారు. దాసరి నారాయణరావు గారు, ముత్యాల సుబ్బయ్య గారు, రవిరాజా పినిశెట్టి, మురారి గారు, శివలెంక కృష్ణప్రసాద్ గారు.. ఇలా వీళ్లు వాళ్లు అని లేదు.. ఒక్కోరోజు ఇద్దరు ముగ్గురు చొప్పున వెళ్లడం, వారితో అర్థరాత్రి వరకూ కబుర్లు చెబుతూ కూర్చోవడం ఆయనకు అలవాటు. దీనికి ఓ కారణం ఉంది.
మాటల్లో కొత్తగా వారు ఏ ప్రాజెక్ట్ చెయ్యబోతోందో రాజు గారికి వాళ్లు చెబుతారు. ఏ తేదీన మొదలుపెట్టాలనుకుంటున్నారో, హీరో హీరోయిన్ ఎవరనుకుంటున్నారో కూడా పంచుకుంటారు. ఆయన అంతా మైండ్‌లో గుర్తు పెట్టుకుంటారు. ఇలా కొత్త సినిమాలకి సంబంధించిన సమాచారం సేకరించగానే హుటాహుటిన ఆఫీసుకి వస్తారు. రాత్రి 10, 11 సమయంలో క్రింద ఆటో శబ్ధం వచ్చిందంటే.. అప్పటి దాకా కంప్యూటర్ ముందు కుర్చీల్లో కూర్చుని కునికిపాట్లు పడుతున్న మేము అలర్ట్ అయ్యే వాళ్లం. సూపర్ హిట్ ఎడిటోరియల్ పేజీలో ఫ్లాష్ న్యూస్ అని ఓ కాలమ్ ఉండేది. నిలువుగా ఇంత పొడవు. ఆయన మా పక్కన కూర్చుని ఒక్కో కొత్త సినిమా గురించి రెండు మూడు లైన్లు రాయగానే నేను, కంప్యూటర్ శ్రీనివాస్ టైప్ చేసి, ప్రింట్ తీసే వాళ్లం. ఆయన భలే ట్రికీగా రాస్తారు. ఏదైనా కొత్త సినిమా హీరో పేరు అప్పుడే చెప్పడం ప్రైవసీ రీత్యా ఇబ్బంది అనుకుంటే.. “వి”తో మొదలయ్యే పేరు కలిగిన ప్రేమ సినిమాలు చేసిన హీరో అని రాస్తారు. అంటే అక్కడ వినీత్ అని అర్థం.
ఆయన వస్తూ వస్తూ ఏ మసాలా జీడిపప్పో ఇంకోటో ఆయా సినిమా ఆఫీసుల నుండి తీసుకొచ్చేవాళ్లు. ప్రతీ సినిమా హీరో, దర్శకులు ఆయనకి చాలా సన్నిహితులు కాబట్టి అక్కడ పనిచేసే ఉద్యోగులకి రాజు గారంటే గౌరవం. రాగానే మా పనులు మేము చేసుకుంటుంటే “తీసుకో శ్రీధర్, తీసుకో శ్రీను” అంటూ ఆ పాకెట్లని మా చేతిలో నాలుగైదు పప్పులు పడేలా ఒంపేవారు.
అలా ఏ 12.30, ఒంటి గంటలో పేజీ పూర్తయ్యేది. కడుపు నకనకలాడి ఆహారం పడక ఇంతలోతు అంటుకుపోయి ఉండేది. జేబులో నుండి ఓ 700, 1000 రూపాయలు తీసి ఇచ్చి “భోజనం చేసి వెళ్లండి” అనే వారు. ఆ అర్థరాత్రి టైమ్‌లో అక్కడకు దగ్గర్లో ఒకే ఒక హోటల్ ఉండేది. అదీ ఒక్క కస్టమర్ ఉండే వాడు కాదు. ఇప్పట్లా జనాలు అర్థరాత్రిళ్లు అప్పట్లో తిరిగే వారు కాదు. వెళ్లి అడుగు బొడుగూ ఉండే బిర్యానీని ముగ్గురం రెండు ప్లేట్స్ తీసుకుని తినేవాళ్లం. ప్రాణం లేచొచ్చినట్లు ఉండేది. కొన్నిసార్లు మాతో పాటు సుబ్రహ్మణ్యం గారని మరో లేఅవుట్ ఆర్టిస్ట్ ఉండేవారు. నేను బి.ఎ.రాజు గారిలో చూసిన వృత్తి పట్ల కమిట్మెంట్ ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గరా చూడలేదు. వాస్తవానికి ఆయనకు నా మీద చాలా ప్రేమా, కానీ అంతలోనే కోపం కూడా! ఆ కోపానికి బలమైన కారణం ఉంది.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే రాజు గారు సినిమా ఇండస్ట్రీ మనిషి. దిగ్గజ దర్శకులు మొదలుకుని ప్రతీ టెక్నీషియన్‌కి ఆయన అజాత శత్రువు. ఎవర్నీ పల్లెత్తి ఒక్క మాట అనరు. చులకనగా ప్రవర్తించరు. ఆ స్వభావం సూపర్ హిట్‌లోనూ ప్రతిఫలించేది.
నాకు సినిమా జర్నలిస్టుని అని చాలాసార్లు మర్చిపోయేవాడిని. ఏదైనా సినిమా గురించి రాసేటప్పుడు కొన్నిసార్లు విమర్శనాత్మకంగానూ రాసేవాడిని. ఉదా.కి. ఓసారి సీనియర్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారి గురించి ఒక సగం పేజీ ఆర్టికల్ రాశాను. ఆయనలో మంచీ, చెడూ రెండింటి గురించీ రాశాను. ఈ విషయంలో జయా మేడమ్ నాకు ఇన్స్పిరేషన్. ఆమెకి ఇలా ఇష్టం. కానీ రాజు గారికి ఇలా విమర్శ అనేది పడదు. నా ఆర్టికల్ రాజు గారు చూశారు. “ఏంటి శ్రీధర్ ఇలా రాస్తే ఆయనేమనుకుంటారు, కాస్త మార్చి రాయి” అన్నారు. ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఆయనకీ నాకూ చాలాసార్లు ఇలాగే క్లాష్ అయ్యేది. అలాగని నన్ను సినిమా కవరేజ్లకి పంపకుండా ఆగేవారు కాదు.. నా రచనా శైలి ఆయనకి చాలా ఇష్టం.
నేను ఏ సినిమా గురించి రాసినా “అద్భుతం, తిరుగులేని దర్శకులు, ఇండస్ట్రీ పెద్ద” ఇలా ఉపమానాలు రాయమనే వారు. నాకు అలా రాయాలంటే భజన చేసినట్లు ఉంటుందని గొంతులో వెలక్కాయ పడినట్లు ఉండేది. తప్పక రాసేవాడిని. నేను సినిమా ఫీల్డ్ వదిలేయడానికీ అదీ ఓ అతి ముఖ్యమైన కారణం. ఆ విషయం మరోసారి వివరంగా చెబుతాను.
కొన్నిసార్లు సాయంత్రం సమయంలో ఏదో ప్రెస్‌మీట్‌కి వెళ్లి ఉంటాం నేనూ, మా ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావు. ఆ సినిమా పిఆర్ఓ కవర్లో ఓ రెండొందలో, మూడొందలో పెట్టి ఇచ్చేవారు. తిరిగి ఆఫీసుకి వెళితే కొడంబాక్కం నుండి టి.నగర్లో ఉండే రూమ్‌కి 27C బస్ ఎక్కి చేరుకునే వాడిని. నాగేశ్వరరావు ఇల్లు ఆఫీసుకి దగ్గర్లోనే కాబట్టి నేను ఒక్కడినే మిగిలే వాడిని. అప్పటికే విపరీతమైన ఆకలితో కడుపులో ఉండలు చుట్టుకునేలా నొప్పి ఏర్పడేది. టి.నగర్ బస్టాఫ్ దగ్గర ఓ చిన్న హోటల్‌కి వెళ్లి అప్పట్లో నాన్-వెజ్ తినే వాడిని కాబట్టి ప్రాన్స్ ఫ్రై తీసుకునే వాడిని. నాకు ఆనియన్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఆనియన్ సలాడ్ పదిరూపాయలు ఉండేది. నాలుగైదు పీసెస్ ఇచ్చేవాడు. అది తెప్పించుకుని అంత ఆకలి మీద తింటుంటే స్వర్గం కన్పించేది. చెన్నైలో ఉన్నన్ని రోజులూ ఇలాంటి ఆకలితో నకనకలాడిన బ్రతుకులే. ఒకరోజు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, రజనీకాంత్, కమల్ హాసన్, జగపతిబాబు వంటి పెద్ద పెద్ద హీరోలతో, దాసరి గారి లాంటి వారితో వారి పక్కనే నిలబడి ఫైవ్ స్టార్ హోటల్లో తింటే మరుసటి రోజు జేబులో యాభై రూపాయలు కూడా లేక పస్థులుండడమూ జరిగేది.
ఓసారి మా అక్క, బావ చెన్నై వచ్చారు. ఏదో హోటల్లో ఉన్నారు. వాళ్లని కలిసి నేను తిరిగి వెళుతుంటే.. సన్నగా, పీలగా, ఊగులాడుతూ, నిస్తేజంగా వెళుతున్నానట. మా అక్క ఆ దృశ్యాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఈరోజు నాకు పేరు రావచ్చు, ఆర్థికంగా కొంత స్థిమితంగా ఉండి ఉండొచ్చు. కానీ జీవితం నాకు చాలా నేర్పింది. నేను నడిచి వచ్చిన ప్రతీ అడుగూ, చివరకు 27C బస్ నెంబర్‌తో సహా నా కళ్ల ముందు ఉన్నాయి. లైఫ్‌కి, నా జీవితంలో నా ఎదుగుదలకి సహకరించిన ప్రతీ ఒక్కరికీ పాదాభివందనాలు.
మరో భాగంతో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu