ఓ ఫైవ్ స్టార్ హోటల్.. ఓ పెద్ద హీరోకి పర్సనల్ PRO.. ప్రెస్ వాళ్లందరికీ ఇన్విటేషన్స్ పంపించి వాళ్లు రాగానే ప్రెస్ మీట్ ఏర్పాట్లు చెయ్యడం.. ఇలా ఉండి ఉండేది నా జీవితం ఇప్పుడు!
ప్రతీ ఒక్కరి జీవితం కొన్ని మలుపులు తిరుగుతుంది. అది మలుపు అన్నది అప్పుడు తెలీదు.. వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఎంత పెద్ద మలుపో అర్థమవుతుంది.
మద్రాసులో ఉన్నంత వరకూ అటు సూపర్ హిట్ సినిమా పత్రిక ద్వారా సినిమా రంగంలోనూ, ఇటు క్రేజీ వరల్డ్ ద్వారా టెక్నాలజీ, సోషల్ జర్నలిజం రంగాల్లోనూ కొనసాగుతూ ఉండే వాడిని.
ఒకరోజు విజయ్ వర్మ చెన్నై వచ్చాడు! క్రేజీ వరల్డ్‌లో ఇద్దరం కలిసి కంట్రిబ్యూట్ చేస్తుండే వాళ్లం అని గతంలో చెప్పాను కదా, అతను! ఆఫీస్ పని పూర్తయ్యాక టి.నగర్ ఏరియాలో ఇద్దరం కలిశాం. “హైదరాబాద్ వచ్చేయి సోదరా, మనం కంప్యూటర్ మేగజైన్ మొదలుపెడదాం” అన్నాడు.
అప్పటికే సినిమా ఫీల్డ్ పట్ల నాకు ఉత్సాహం చచ్చిపోయింది. దానికి అనేక కారణాలు గతంలో చెప్పాను కదా! “ఫలానా హీరో తోపు, తురుము, ఫలానా దర్శకుడు చాలా గొప్పోడు, ఫలానా సినిమా అంచనాలను మించి రికార్డులు బద్దలు కొడుతోంది” ఇలాంటి మెహర్భానీ రాతలు రాయలేక సినిమా జర్నలిస్టుగా ప్రతీ క్షణం చచ్చిపోయే వాడిని. పాపం దివంగత BA రాజు గారు నాకు పొగుడుతూ రాయమని మళ్లీ మళ్లీ చెప్పలేక ఆయనా ఇబ్బంది పడేవాడు.
సో వర్మ హైదరాబాద్ వచ్చేయమని చెప్పగానే “సినిమా ఫీల్డ్ వదిలి వెళ్లిపోదాం, ఇక్కడ వ్యక్తిత్వాన్ని చంపుకుని భజనలు చేస్తూ బ్రతకలేను” అనే బలమైన కోరిక తొంభై శాతం ఉంటే, గ్లామర్ ఫీల్డ్‌ని, పెద్ద పెద్ద వాళ్లతో కలిసి పనిచేసే అవకాశాన్ని వదులుకుంటున్నానేమో అనే ఆ వయస్సులో ఉండే సందేహం ఓ పదిశాతం ఉండేది. ఓ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించి హైదరాబాద్ వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాను. ఆ నగరం నాకు తెలీదు. ఎప్పుడూ వెళ్లలేదు.
చీరాలలో ఉండే మా ఉమక్కకి STD కాల్ చేస్తే.. “ఇక్కడకు వచ్చి ఓ పదిహేను రోజులు ఉండి వెళుదువు” అంది! చెన్నై నుండి చీరాల వెళ్లడానికి చేతిలో ఒక్క పైసా లేదు. నా రూమ్మేట్ రాంబాబుకీ, విజయ్ వర్మకి తప్పించి నేను తిరిగి రానని ఇంకెవరికీ తెలీదు. గతంలో నాకు తెలుగు మాడ్యులర్ కీబోర్డ్ టైపింగ్ నేర్పించిన కంప్యూటర్ శ్రీనుని 1500 అడిగాను… సంక్రాంతికి ఊరెళ్లి వచ్చాక ఇస్తానని! అది అబద్ధం అని తెలుసు. నాకు నాకు వేరే మార్గం లేదు. జయా మేడమ్‌కి చెప్పాను… పండక్కి ఊరెళ్లి వస్తానని! అదే చివరు చెన్నైని చూడడం.. మళ్లీ ఇప్పటి వరకూ అడుగు పెట్టలేదు. కంప్యూటర్ శ్రీనుకి 1500 బాకీ ఉన్నాను. నా జీవితంలో నేను చేబదులు అడిగిన మొదటీ చివరి వ్యక్తీ అతనే! అతను అప్పుడు ఇచ్చిన 1500 తర్వాత తీర్చే అవకాశం రాలేదు. ఏళ్లు గడిచిపోయాయి. అది తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా అపరాధ భావం అన్పించేది. ఇప్పటిలా గూగుల్ పే, ఫోన్ పే ఉండేది కాదు, ఫోన్ కాల్స్ ఉండేవి కాదు.
ఆ తప్పు చేశాననే భావనతో ఒక నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో ఇంకెప్పుడూ పది రూపాయలు కూడా ఇంకొకరి సొమ్ము చేబదులు తీసుకోకూడదని, అలాగే ఎవరో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఆశించకూడదు అని! ఈరోజు వరకూ నాకుంటే తిన్నాను, లేకపోతే పస్తులున్నాను, లేదా సర్ధుకుని బ్రతికాను తప్పించి ఒక్కరు… ఒక్కరినంటే ఒక్కరిని కూడా ఒక్క పైసా అడ్జెస్ట్మెంట్కైనా ఇవ్వమని అడగలేదు. బయటి వాళ్లు మాత్రమే కాదు.. మా అక్కలను గానీ, మా బంధువుల్ని గానీ ఎవరి దగ్గరా చేయి చాచింది లేదు. 2020లో కరోనా లాక్ డౌన్ వరకూ నా నెలవారీ సేలరీ 20 వేలు. ఏదో పొలం మీద సంవత్సరానికి వచ్చే ఓ లక్ష రూపాయలు, ఇవీ కలిపి పొదుపుగా బ్రతికాం నేనూ నా భార్య. అలాంటి భార్య దొరకడం నా అదృష్టం. 2020లో కంప్యూటర్ ఎరా ఆగిపోయాక మార్చి నుండి అక్టోబర్ వరకూ నడిరోడ్డు మీద ఉన్నాను. ఒక్క పైసా ఆదాయం లేదు. బ్యాంక్ అకౌంట్లో 50 వేలు ఉంది. అదే సర్ధుకుని బ్రతుకుతూ వచ్చాను. ఏం చేయాలో తెలీదు. కానీ ఈసుమంతైనా భయం లేదు. “నేను ఎవరికీ అన్యాయం చెయ్యలేదు, దేవుడే అన్నీ చూసుకుంటాడు, ఎలాగోలా బ్రతకలేకపోతానా” అనే ధీమా!
2020 దసరా ముందు రోజు ప్రముఖ జర్నలిస్ట్, నా ఆత్మీయులు దేశరాజు శ్రీనివాస్ గారి సతీమణి, నన్ను అన్నగా భావించే జ్యోతి గారు కాల్ చేశారు. అమెకి ఎందుకు అన్పించిందో తెలీదు, కాల్ చెయ్యడం చెయ్యడం “ఏంటన్నా ఎవరెవరో సంపాదించుకుంటున్నారు, ఎవరికీ తెలీని ఇంత నాలెడ్జ్ పెట్టుకుని మీరు అతి మామూలుగా ఉండడం ఏంటి, అర్జెంటుగా ట్రైనింగ్ సెషన్లని మొదలు పెట్టండి” అని మొత్తుకున్నారు. వాస్తవానికి డబ్బు గురించి ఎవరు మాట్లాడినా ఎప్పుడూ డిస్ కనెక్ట్ అయ్యే వాడిని. “మీ నాలెడ్జ్‌లో 1 శాతం లేని వాళ్లు కూడా సంపాదించేసుకుంటున్నారు, మీరేంటి సర్” అంటూ అప్పటికే ప్రతాప్ చిరుమామిళ్ల, అప్పట్లో TV9లో పనిచేసే హరీష్ ఇలా ఎందరో చెబుతూ ఉండే వాళ్లు. నవ్వి ఊరుకునే వాడిని. నిశితంగా గమనిస్తే నా జీవితం మొత్తం స్పిరిట్యువల్ జర్నీనే సాగింది. మొదట్లో దురలవాట్లు, నన్ను నేను తెలుసుకోవడం, మెటీరియల్ విషయాలకు డిటాచ్డ్గా బ్రతకడం.. ఇలా! దాంతో నేను డబ్బు విషయాలు అస్సలు పట్టించునే వాడిని కాదు. ఇతరుల్ని చూసి ఈర్ష్య, అసూయ లాంటివి నా జీవితంలో ఇప్పటి వరకూ లేవు. నా బ్రతుకు నేను బ్రతకడమే, నా సమయం వచ్చినప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లడమే నా దృక్పధం.
జ్యోతి చెల్లెమ్మ వత్తిడి పెట్టిన వెంటనే.. మొదటిసారి డబ్బు గురించి ఆలోచించాను. “సరే” అని “టైమ్ మేనేజ్మెంట్” మీద రేపు దసరా రోజు సెషన్ ఉంటుంది అని అనౌన్స్ చేశాను. పది గంటలు కష్టపడి కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాను. నా జీవితానుభవాలు ఆ సెషన్‌కి బాగా ఉపయోగపడ్డాయి. ఒక్కరోజు ముందు అనౌన్స్ చేసినా 197 మంది చేరారు. అప్పుడు నన్ను నిలబెట్టిన ప్రతీ ఒక్కరికీ ఇప్పటికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీకు నాలెడ్జ్ ఇచ్చాను.. మీరు నన్ను బ్రతికేలా చేశారు. ఆ తర్వాత అమెజాన్ ప్రోడక్టులు ప్రతీదీ స్టడీ చేసి బెస్ట్ ప్రోడక్టులు రికమెండ్ చెయ్యడం మొదలుపెట్టాను. నేను ఫేస్బుక్లో షేర్ చేసే లింకుల ద్వారా నా మిత్రులు ఎవరైనా ఏదైనా కొంటే అతి కొద్దిగా నాకు కమీషన్ వస్తుంది. చాలామంది నామీద ప్రేమతో, నా మీద ఇష్టంతో నా లింకుల ద్వారా కొనడం మొదలుపెట్టారు. ధర ఒకటే అయినప్పుడు ఆ కొనేదేదో నా లింక్ ద్వారా కొంటే నాకూ హెల్ప్ అవుతుందన్న భావన వారిలో నాటుకుపోయింది. ఇలా మిత్రుల ప్రేమాభిమానాలు నన్ను ఆర్థికంగా నిలబెట్టాయి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను.. 25 ఏళ్లు తిన్నానో, తినలేదో చూసుకోకుండా ఈ సమాజానికి ఏదో చెయ్యాలన్న తపనతో అతి కొద్ది జీతంతో పనిచేసిన నాకు నడిరోడ్డు మీద ఉన్నప్పుడు మీరందరూ దేవుడి రూపంలో ఆదుకున్నారు. మీ పెద్ద మనస్సుని ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితం మొత్తం మీద ఒక్క పైసా గురించి వెదుక్కోవలసిన అవసరం లేకుండా బ్రతికింది ఈ రెండేళ్లే! ఎవరెవరో పెద్ద పెద్ద స్టేజ్‌ల మీద మాట్లాడమని పిలుస్తారు.. ఎవరెవరో టివి ఛానెళ్లలో డిబేట్లని పిలుస్తారు.. 2500 వరకూ టివి షోస్ చేశాను.. ETV తప్పించి కనీసం పది రూపాయలు కూడా ఏ ఛానెల్ చెల్లించలేదు. అయినా నవ్వుతూనే బ్రతికాను. “నేనే యోగిని అయినప్పడు భోగాలు నాకెందుకు..” అనే భావనే ఉండేది.
ఈ రెండేళ్లలో సంపాదించుకున్న కొద్ది డబ్బుతో, ఊళ్లో అమ్మ ఇచ్చిన ఐదెకరాల పొలాన్ని కొన్ని అనివార్య పరిస్థితుల్లో అమ్మి ఇప్పుడు మియాపూర్‌లో ఇల్లు తీసుకుంటున్నాను. తాతయ్య, అమ్మ నా బాగుని కోరుకున్నారు. నాకు పిల్లలు లేకపోవడం వల్ల నేను తర్వాతి తరాలకు ఇవ్వాల్సింది కూడా ఏదీ లేదు కాబట్టి.. జీవించి ఉండగా నేను కొద్దిగా సౌకర్యంగా ఉంటే తాతయ్య, అమ్మ సంతోషిస్తారు అన్న నమ్మకంతో పొలం అమ్మాల్సి వస్తోంది. అదీగాక ఊళ్లల్లో పొలాలు చూసుకునే వారు ఎవరూ ఉండడం లేదు. మియాపూర్ ఫ్లాట్ విషయంలో కూడా నా బేసిక్ ప్రిన్సిపుల్స్ ప్రకారం నేను ఒక్క పైసా లోను తీసుకోవడం లేదు. నా దగ్గర డబ్బు ఉంటేనే అది ఇల్లయినా, టివి అయినా, ఫ్రిజ్ అయినా, కారు అయినా కొనడం, లేదంటే ఉన్న దాంట్లో బ్రతకడమే నాకు జీవితాంతం అలవాటు. నేను నిరంతరం స్వేచ్ఛని కోరుకుంటాను.. ఎవరిపై ఆధారపడడం, ఎవరి దగ్గరో చేయి చాచి మాట పడాల్సి రావడం, ఏదో ఎవరికో అప్పు ఉన్నామనే ఆందోళనా.. ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ నేను భరించలేను.. నా జీవితం ఉన్నంతలో నా నియంత్రణలో ఉండాలి. మా అమ్మమ్మ, తాతయ్య పచ్చడి మెతుకులతో బ్రతకంగా లేనిది నేను బ్రతకలేనా!
చెన్నై నుండి చీరాల వెళ్లాక ఏం జరిగిందో మరో భాగంలో రాస్తాను.
- Sridhar Nallamothu