మొత్తానికి ఓ పదిహేను రోజులు ఉండి అటు నుండి అటు హైదరాబాద్ వెళదామని చీరాల వెళ్లాను. మా ఉమక్క వాళ్లు అప్పటికే ఓసారి చెన్నై ఏదో పని మీద వచ్చి సరైన తిండి, పోషణ లేకుండా ఉన్న నా అవతారం చూసి దిగులుతో ఉండడం వల్ల, చీరాలలో ఉన్న 15 రోజులు వద్దు వద్దంటున్నా బలవంతం చేసి కడుపు నిండా పెట్టేవారు. నన్ను ఎలాగైనా కాస్త నార్మల్ చెయ్యడం వాళ్ల ఏకైక లక్ష్యం ఆ పదిహేను రోజులు.
హైదరాబాద్ బయల్దేరదామని టికెట్ బుక్ చేసుకుని ఏదో ట్రావెల్స్ బస్ ఎక్కాను. జీవితంలో హైదరాబాద్ చూసింది లేదు. మిత్రుడు విజయ్ వర్మ లాండ్‌లైన్‌కి కాల్ చేస్తే మలక్‌పేట టివి టవర్ దగ్గర దిగి దాని ఎదురు ఉండే రోడ్లో ఓ రెండు కిలోమీటర్ల దూరంలో లెఫ్ట్ సైడ్ ఏదో షాపు పేరు చెప్పాడు, ఇప్పుడు గుర్తు లేదు. అదే నా బస. బస్ క్లీనర్‌కి టివి టవర్ వచ్చాక ఆపమని చెప్పి రాత్రంతా నిద్ర లేకుండా వేగంగా కదిలే లైట్లని, చెట్లని చూస్తూ కూర్చున్నాను. “అసలు నా భవిష్యత్ ఏమవుతుంది, బ్రతగ్గలనా, ఉన్న ఓ చిన్న జాబ్ వదిలి పెట్టి వచ్చాను, అందరిలా ఏదో ఓ ఐ.టి కోర్స్ చేసి ఐ.టి.లోకి వెళ్లిపోయినా బాగుండేది. ఏదో తెలుగు వాళ్లకి టెక్నాలజీ అందిద్దాం అని ఊరికే ఆదర్శాలు పట్టుకుని వేలాడుతున్నానా” ఇలా సాగాయి ఆలోచనలు. “సరే ఏదైతే అదయిందిలే, బ్రతకలేకపోతానా” అనే గుండె ధైర్యంతో స్థిమితపరుచుకున్నాను.
బస్‌లో లైట్లు వేసి LB నగర్ అని క్లీనర్ అరుస్తూ ఉన్నప్పటి నుండి సీట్లో నుండి ముందుకెళ్లి “టివి టవర్ ఇంకెంత దూరం ఉంది, మర్చిపోకుండా పిలువు” అని చెప్పొచ్చాను. 1998 వేసవిలో అలా ఓ ఉదయం మలక్‌పేట టివి టవర్ దగ్గర దిగాను. ఆటో వాళ్లు ముసురుకున్నారు “ఎక్కడికి వెళ్లాలి” అని! ఓ రెండు కిలోమీటర్లు వెళ్లాలని బేరం ఆడుకుని మెల్లగా షాపు పేరు చూసుకుంటూ వెళ్లాను. ఫస్ట్ ఫ్లోర్లో వర్మ చెప్పిన ఆఫీస్ కన్పించింది. అది వర్మ మిత్రుడు గోపీనాయుడు గారి ఆఫీస్. ఆయన పెద్దగా ఎలాంటి యాక్టివిటీస్ చెయ్యకపోవడం వల్ల ఖాళీగా ఉంది. నేను ఒక్కడినే దాంట్లో ఉండాల్సింది.
బ్రష్ చేసుకుని తినడానికి ఏమైనా ఇడ్లీ దొరుకుతాయేమోనని అటూ, ఇటు కలిపి ఓ కిలోమీటర్ నడిచాను. ఎక్కడ చూసినా ఉస్మానియా బిస్కెట్లు, టీ తప్పించి లేవు. సరేలే అని ఓ రెండు ఉస్మానియా బిస్కెట్లు తిని, టీ తాగి ఆకలి అణిచేసుకున్నాను. స్మార్ట్ ఫోన్లు లేని రోజులు. లాప్టాప్ అనేదే అప్పటి వరకూ చూడని రోజులు. రూమ్‌కి వచ్చి సూట్ కేసు తీసి లోపల ఎప్పుడూ సిద్ధంగా ఉండే నోట్ బుక్స్, పెన్నూ తీసుకుని రాయడం మొదలుపెట్టాను. జీవితం గురించీ, నా అనుభవాల గురించీ, మనుషుల గురించీ.. ఇలా నిండిపోతూ ఉండేవి పేజీలు. బోర్ కొడితే బాల్కనీలోకి వచ్చి ఓ సిగిరెట్ తాగడం!
నేను గోపీనాయుడు ఆఫీస్ నా తాత్కాలికమైన బస అనుకున్నాను. ఉదయం 10 తర్వాత పంజాగుట్ట కాలనీలో ఉండే విజయ్ వర్మ ఆఫీసు లాండ్‌లైన్‌కి దగ్గరలో ఉన్న ఎస్టీడీ బూత్ నుండి కాల్ చేశాను. వర్మ వాళ్ల కజిన్ రాము ఫోన్ ఎత్తి, “మీరు ఫలానా నెంబర్ బస్ ఎక్కి పంజాగుట్ట చౌరస్తా దగ్గర దిగి నడుచుకుంటూ వస్తుంటే కుడి వైపు దుర్గా భవాని టెంపుల్ కన్పిస్తుంది, దాని ఎదురు 9/2RT అని ఉండేదే మన ఆఫీస్ రండి శ్రీధర్” అని చెప్పాడు.
తీరా వెళ్లాక వర్మతో పాటు రాము, ఇంకో ఒకరిద్దరు మిత్రులు, అప్పట్లో వంటవాడిగా పనిచేస్తూ ఇప్పుడు ప్రముఖ కెమెరామెన్ అయిన లింగబాబు ఉండడం చూశాను. “ఇక్కడ ఉండడానికి ప్లేస్ లేదు, ఓ నెలరోజులు మలక్‌పేటలోనే ఉండండి” అని చెప్పారు. ఇంకేం చేస్తాను.. సరే అని సాయంత్రం దాకా కూర్చుని ఏడెనిమిదింటికి బస్ పట్టుకుని తిరిగి వెళ్లిపోయేవాడిని.
రెండో రోజో, మూడోరోజో రాత్రి ఒంటి గంట సమయంలో రెస్ట్‌రూమ్‌కని లేచి వెళుతుంటే ఆ పక్కనే చిన్న పూజ గది లాంటి దానిలో కుంకుమ, పగిలిపోయిన గాజులు, ఓ క్లాత్ చెల్లాచెదురుగా కన్పించాయి. అప్పటికే చేతబడులు ఇలాంటివి చదివి ఉండడం వల్ల ఓ చిన్నపాటి భయం పట్టుకుంది, అసలు ఇదేమై ఉంటుందా అని! ఇక ఆ రాత్రి నిద్రపట్టలేదు. మరుసటి రోజు పంజాగుట్ట వెళ్లినప్పుడు రాముని అడిగాను. “గోపీనాయుడు గారి అమ్మ ఈ మధ్య చనిపోయారు, ఆమె కార్యక్రమం ఏదో చేశారు అక్కడ” అన్నాడు. సాయంత్రం మలక్‌పేట వెళ్లాక దెయ్యాల ఆలోచనలు ముసురుకున్నాయి. ఒక్కడినే ఉండడం, ఆ ఏరియా అంతా కమర్షియల్ ఏరియా అవడం వల్ల ఇల్లు అనేవి ఉండేవి కాదు. పగలు పది గంటల దాకా అప్పుడప్పుడు ఓ టూవీలర్, పది నిముషాలకో కారు తప్పించి కన్పించేవి కాదు. అంతా నిర్మానుష్యం. ఏదో మనుష్య సంచారం లేని ఎడారిలో ఉన్న అనుభూతి!
ఇక రాత్రిళ్లు నిద్ర కరువైంది. లాభం లేదని పెన్నూ, బుక్ పట్టుకుని ఏదేదో అలా రాసుకుంటూ కూర్చునే వాడిని. ఎప్పుడో వేకువజామున 3-4 గంటలకి దానంతట అదే ఓ చిన్న కునుకు పడితే అదే నిద్ర. పంజాగుట్ట వెళితే భోజనం ఉండేది. ఏరోజైనా వెళ్లకపోతే ఇక నరకమే. బ్రేక్‌ఫాస్ట్ అనేది అస్సలే దొరకదు. కనీసం మధ్యాహ్నం అన్నం తిందామన్నా రెండున్నర కిలోమీటర్లు అటూ ఇటూ నడిచి చూశాను.. ఒక్కటంటే భోజన హోటల్ కన్పించేది కాదు. ఇరానీ టీ సెంటర్లో మధ్యాహ్నానికి సిద్ధమయ్యే లావుపాటి సమోసాలో, లేదా కొన్ని షాపుల్లో ఉండే మిర్చి బజ్జీలో తింటూ దాదాపు నెలరోజులు బ్రతికేశాను. మరో పక్కన రాత్రిళ్లు నిద్ర ఉండేది కాదు. పగలు కునికిపాట్లు పడుతూ అలాగే కుర్చీలో కూర్చునే వాడిని. ఒకవేళ రాత్రిళ్లు ఏ రోజైనా నా వల్ల కాని బలవంతంగా నిద్రపోదామని ప్రయత్నించినా, అది ఆఫీసు కావడం వల్ల ఎలాంటి బెడ్ వసతీ లేకపోవడం వల్ల నా టవల్ ఫ్లోర్ మీద వేసుకుని పడుకోవడం, దాంతో పక్క కుదరక నిద్రపట్టేది కాదు.
పంజాగుట్ట వెళుతున్నానే గానీ, నేనేం పనిచెయ్యాలో విజయ్ వర్మ ఇంకా చెప్పలేదు. అప్పుడప్పుడు ఖర్చులకి వందా రెండొందలు ఇస్తూ ఉండే వాడు. “పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వెంకటరెడ్డి గారు కంప్యూటర్ వరల్డ్ అని పత్రికను తీసుకు రావాలనుకుంటున్నారు. అదంతా నువ్వు చూసుకోవాలి. అది ఇంకా టైమ్ పడుతుంది. అప్పటి వరకూ మన ఆఫీసులో యాడ్ డిజైనింగ్, డి.టి.పి వర్క్ చేస్తుండు” అని వర్మ చెప్పాడు. దానికంటూ ఎలాంటి సేలరీ ఉండేది కాదు. బస్ ఖర్చులకి, రోజుకో సిగిరెట్ పాకెట్ ఖర్చులకి (2005లో పూర్తిగా మానేశాను, ఇప్పటి వరకూ సిగిరెట్ పాకెట్ పట్టుకోలేదు), అప్పట్లో బీర్ అలవాటు ఉండేది (2005లోనే డ్రింక్ మానేశాను, ఇప్పటి వరకూ పట్టుకోలేదు, ఇక జీవితంలో కూడా పట్టుకోను), ఆ బీర్ ఖర్చులకి, బజ్జీలు, టీ ఖర్చులకి డబ్బులు తీసుకోవడం తప్పించి! చాలాసార్లు ఆకలికి, కొన్నిసార్లు ఆ బజ్జీలు తినీ తినీ పేగులు మెలిపెట్టేవి. విపరీతమైన నొప్పి ఉండేది. ఏ టాబ్లెట్ వేసుకోవాలో తెలీదు. అసలు దగ్గరలో మెడికల్ షాపులు కూడా ఉండేవి కావు. మెల్లగా మలక్‌పేట నుండి పంజాగుట్ట కాలనీలో విజయ్ వర్మ ఆఫీసుకి మూవ్ అయ్యాను.
లైఫ్ ఎప్పుడూ నన్ను పరీక్షిస్తూనే వచ్చింది.. నన్ను మరింత మెరుగ్గా తయారు చెయ్యడానికి!
మిగతా వచ్చే భాగంలో!
- Sridhar Nallamothu