నా జీవితంలోని ముఖ్యమైన వ్యక్తుల గురించి రాశాక నా కెరీర్లో నేను చూసిన సవాళ్ల గురించి రాస్తాను.
“ఏదీ నోరు తెరువు” అంటూ మా ఉమక్క కళ్లు కావాలని పెద్దవి చేసుకుని గట్టిగా గద్దించేది.
ఓ పక్క ఎండలు, మధ్యాహ్నం టైమ్ అందరూ ఓ కునుకు వేసేటప్పుడు నేను ఏ కిళ్లీ కొట్టు దగ్గరో సిగిరెట్ తాగొచ్చి మెల్లగా మా ఇంటి వెనుక గుమ్మం గుండా లోపలికి ప్రవేశిస్తుంటే సీన్ ఇది.
నోరు తెరిస్తే ఆ స్మెల్ని బట్టి నేను సిగిరెట్ తాగొచ్చానో లేదో అర్థం చేసుకుని.. “ఏంటి బాబూ, ఇలాగైతే ఎలా చెప్పు” అంటూ మొహం అసహ్యంగా పెట్టుకుని లోపలికి వెళ్లేది. నేను అపరాధ భావాన్ని మోస్తూ లోపలికి వెళ్లి నిశ్శబ్ధంగా మంచం మీద పడుకునే వాడిని.
నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మా పెద్దక్క ఉమక్క పెళ్లయింది, అలాగే ఇంటర్లో ఉన్నప్పుడు చిన్నక్క పద్మక్క పెళ్లయింది. భరత్ బావా, సుబ్బారాయుడు బావా సినిమాలకీ అటూ ఇటూ నన్ను కూడా తీసుకెళ్లే వారు, నేను వాళ్ల ఊళ్లు వెళ్లినప్పుడు! మా పెద్దక్క పెళ్లయిన కొన్నేళ్లకే భరత్ బావ చనిపోయారు. దాంతో తను మళ్లీ మా ఊరు వచ్చేయడం, తనూ, నేనూ మా మేనళ్లుల్లు రాజేష్, సుధీష్ కలిసి ఉండడం మొదలుపెట్టాం. మధ్యలో చాలా పరిణామాలు, స్థలాభావం వల్ల అన్నీ రాయలేను.
ఉమక్క గానీ, పద్మక్క గానీ నన్ను “బాబూ” అనే పిలుస్తారు. ఇద్దరూ చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్లిద్దరిలో నేను మా అమ్మని చూసుకుంటాను. చాలా ఏళ్ల పాటు ఒకే ఊళ్లో కలిసి ఉండడం వల్ల అలవాటు కొద్దీ నేను ఉమక్క దగ్గర ఎక్కువ గడిపినా పద్మక్క ఏ రోజూ నాకు చూపించే ప్రేమలో లోటు రానీయలేదు. నేను హైదరాబాద్‌లో సెటిల్ అయినా నాకు ఊళ్లో తల్లిదండ్రులు లేకపోయినా ఇప్పటికీ ఊరు వెళుతున్నాను అంటే వాళ్లిద్దరి కోసమే. ఎప్పుడు వెళ్లినా అందరం ఒక దగ్గర కలిసి గడుపుతుంటాం. ఇకపోతే నేను విజయవాడలో ICWA చదవడానికి వెళ్లినప్పుడు నన్ను దిగబెట్టడం మొదలుకుని, నేను తెనాలిలో ICWA కొనసాగిస్తూ స్లీపింగ్ పిల్స్ మింగి స్పృహ లేకుండా ఉన్న స్థితి వరకూ పలుమార్లు సుబ్బారాయుడు బావ నన్ను ఇంటికి తీసుకు రావడం, కనిపెట్టుకోవడం చేసేవాడు.
ఇక్కడ మా ఆమ్మ (పెద్దమ్మ, మా అమ్మ వాళ్ల పెద్దక్క) గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆమె పేరు “నిదానం”. తనకి పిల్లలు లేకపోవడంతో చిన్నప్పుడే మా పద్మక్కని దత్తత తీసుకుని పర్చూరు దగ్గర నాగులపాలెంలో పెంచి, పెళ్లి చేసింది. ఆమె కళ్లు పెద్దవి చేసుకుని గదిమితే ఒణికి పోవాల్సిందే. పిల్లలంటే అంతే ప్రేమా ఆమెకి ఉండేది. టెన్త్ అయ్యాక మా తాతయ్యతో మాట్లాడి నన్ను నాగులపాలెం తీసుకెళ్లి, పర్చూరు భవనం అంజిరెడ్డి కాలేజీలో నన్ను ఇంటర్‌కి చేర్చింది. మా ఊరు కాక మొట్టమొదటి సారి అప్పుడే ప్రపంచాన్ని చూశాను. రోజూ నాగులపాలెం నుండి పర్చూరు సైకిల్ మీద బాక్స్ కట్టుకుని కాలేజీకి వెళ్లే వాడిని.
ఆ కాలేజీలో చదివేటప్పుడు రాఘవరావు అని ఓ మంచి మిత్రుడు ఉండే వాడు. చదువంటే అప్పుడప్పుడే ఆసక్తి పుట్టడంతో పర్చూరులో శివాలయంలో చెట్టు క్రింద ఇద్దరం పుస్తకాలేసుకుని చదువుకుంటూ కూర్చునే వాళ్లం. ఏదైనా బిల్డింగ్ ఉంటే దాని కిటికీకి వర్షం పడకుండా ఉండే అమరికలో జంప్ చేసి మరీ ఎక్కి కూర్చుని చదువుకునే వాళ్లం. “తెనాలి దగ్గర కొల్లిపరలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు ఉన్నాయి, పేర్లు ఇవ్వండి” అని కాలేజీలో నోటీస్ వస్తే, ధైర్యం చేసి మొట్టమొదటి సారి పేరు ఇచ్చాను. వారం రోజుల పాటు రాత్రింబవళ్లు ప్రిపేర్ అయి క్విజ్ పోటీలో మా కాలేజీకి సెకండ్ ప్రైజ్ సంపాదించుకుని వచ్చాను. అప్పుడు మొట్టమొదటి సారి విజయం రుచి చూశాను. “నేను తక్కువ వాడినేమీ కాద”నే నమ్మకం అప్పుడు కలిగింది.
మా నిదానం ఆమ్మ (పెద్దమ్మ) ఐదారేళ్ల క్రితం చనిపోయే వరకూ ఎప్పుడైనా ఊరెళితే “బాబూ శ్రీధరూ, ఇటు రామ్మా” అని మంచంలో కూర్చోబెట్టుకుని తలా, భుజాలూ నిమురుతూ కూర్చునేది. ఆ చిన్న వయస్సులో ఆమె చూపించిన ఆదరణకి ఎప్పటికీ కృతజ్ఞుతనై ఉంటాను.
అలాగే నా జీవితంలో కీలక పాత్ర పోషించిన మరికొందరి గురించి ఖచ్చితంగా రాయాలి. మా రెండో పెద్దమ్మ వీరమ్మ వాళ్ల అబ్బాయి కాపు అంకమ్మ చౌదరి అన్నయ్య. ఆయనకి చిన్నతనంలో తండ్రి చనిపోయారు. ఒక్కడే చాలా కష్టపడి కుటుంబాన్ని చూసుకుని, పిల్లల్ని బాగా చదివించి చాలా గొప్పవాళ్లని చేశారు. తన పిల్లలు ఉదయ భాస్కర్ గానీ, బుల్లెమ్మాయి (నిక్ నేమ్) గానీ చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా ఎదిగారు. నాకంటే వయస్సులో పదిహేనేళ్లకి పైగా పెద్దవాడైన అంకమ్మ అన్నయ్య దగ్గర డిసిప్లెయిన్ నేర్చుకున్నాను. ఆయనంటే చాలా భయం ఉండేది.
అలాగే వీరమ్మ ఆమ్మ రెండో సంతానం మా “నాగేంద్రం” అక్క. ఎవరికీ ఏ లోటూ లేకుండా పిండి వంటలు మొదలుకుని అన్నీ సమకూర్చడంలో ఆమెకి చాలా సంతృప్తి. ఇప్పటికీ ఎప్పుడైనా ఊరెళితే “అన్నం వండుతాను, తిని వెళ్లమ్మా శ్రీధర్” అంటూ చాలా ప్రేమగా చూసుకుంటుంది. నాగేంద్ర అక్క వాళ్ల అబ్బాయి వేణు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. దాదాపు ఒకటి రెండేళ్లు నాకంటే చిన్నవాడు. ఎవరికీ హాని చెయ్యకుండా, ప్రేమగా చూసుకోవడం తన నుండి నేర్చుకోవాలి. ఇద్దరం కలిసి అప్పట్లో కొత్తగా ఇంట్లో కొన్ని టివిలో క్రికెట్ మ్యాచ్‌లు చూసే వాళ్లం. ఇప్పటికీ తనంటే నాకు ఎక్కడ లేని ఇష్టం. తను నోరు తెరిచి మాట్లాడడం తక్కువ, కానీ తనలో ప్రేమ అనంతంగా ఉంటుంది. వేణూ నీపట్ల ఇష్టాన్ని, ప్రేమని ఇప్పటి వరకూ నేరుగా నేను ఎప్పుడూ చెప్పకపోయినా ఇప్పుడు చెబుతున్నా “నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ప్రేమ”.
నా మేనల్లుళ్లు రాజేష్, సుధీష్, బుచ్చిబాబు, మేనకోడలు అనూష అంటే నాకు చాలా ఇష్టం. చాలాసార్లు ఉమక్క, పద్మక్క వాళ్లతో పాటు వీళ్లతో సరదాగా గడపడానికే ఊరెళుతుంటాను. “అంకుల్ని చూసి నేర్చుకోండి” అని ఉమక్క, పద్మక్క వాళ్లని ఒకటికి పదిసార్లు చెప్పడం, వాళ్లు నవ్వి ఊరుకోవడం ఎప్పుడూ జరిగే తంతే. మా జీవితాన్ని నేరుగా వాళ్లు చూడకపోయినా మా పట్ల వాళ్లు చూపించే ప్రేమ ఎక్కడా దొరకనిది.
మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నన్ను మా నాన్నకి ఎలా అప్పజెప్పి కర్నూలు పంపారో, అప్పటి వరకూ మా తాతయ్య సంపాదించిన నగదును మా నాన్న వాళ్ల తమ్ముడు మా బాబాయికి సంరక్షించమని అప్పజెప్పారు. ఆ డబ్బుతో ఆయన నాకు పెళ్లి చేశారు. సరే డబ్బు, ఇతర విషయాలు పక్కనపెడితే నా పెళ్లికి నా తండ్రి రాకపోయినా, బాధ్యతగా దగ్గరుండి పెళ్లి చేసిన మా లక్ష్మి పిన్ని, బాబాయికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. లక్ష్మి పిన్ని ఇప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. అలాగే లక్ష్మి పిన్ని వాళ్ల తమ్ముడు నాగేశ్వరరావు మామయ్య, వాళ్ల భార్య అనిత చాలా ప్రేమగా చూసుకుంటారు.
ఓ దశలో మా బాబాయి ఆర్థికంగా దెబ్బతిన్నాడు. వ్యాపారం కోసం తను తెచ్చిన చాలా అప్పులు తీర్చాల్సి వచ్చింది. ఉన్న దాంట్లో అందరికీ తలో కొంత సెటిల్ చేసే రోజు అది. మా తాతయ్య సంపాదన అప్పజెప్పిన దాంట్లో నా పెళ్లి ఖర్చులు పోనూ నాకు ఇంకా రావాల్సి ఉంది. దానికి సంబంధించిన మీటింగ్ జరుగుతోంది. అక్కడ మా నాన్నా, మా బాబాయి, వాళ్ల స్నేహితుడు మరొకరు ఉన్నారు. నాకు రావాల్సిన దాని గురించి ప్రస్తావన వచ్చింది. “నీకు రావాల్సింది ఇంకేమీ లేద”ని మా బాబాయి అంటే నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాదేమో గానీ మా నాన్న ఆ మాట అన్నాడు. “నీకు ఇంకా రావాల్సిందేమీ లేదు” అని! ఆరోజు బాధేసింది నాన్నా, నిన్ను చూసి బాధ కన్నా జాలి పడ్డాను. ఓ కొడుకుకి నువ్వు ఇచ్చిన గౌరవం, విలువా ఇదా అని! సరే అయినా సరే నీ పట్ల నాకు ఇప్పటికీ ద్వేషం లేదు. ఎందుకంటే నేను మనుషుల్లో ప్రేమని చూస్తాను గనుక, అన్ కండిషనల్‌గా ప్రేమిస్తాను గనుక!
ఇక నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి. తన గురించి చివర్లో రాస్తున్నా, నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానంటే తనే ప్రధాన కారణం. తన సహకారం మరువలేనిది. చాలా మంది భార్యలు “నాకది కొనివ్వు, ఇది కొనివ్వు” అని సతాయిస్తుంటారు. భార్యాభర్తలకి మధ్య సయోధ్య ఉండదు. మరి దేవుడు నాకు ఓ వరంలా తనని ఇచ్చాడో ఏమో గానీ భారతీదేవి నాకు నిజంగా ఓ బలం. నేను ఎలా ఉన్నా, సంపాదించకపోయినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇప్పటి వరకూ తను ఎదురు చెప్పింది లేదు. అలాగని లోపల కుంగిపోయిందీ లేదు. నేను స్పిరిట్యువల్ జర్నీలో ఎలా ఉన్నానో తనూ జీవితాన్ని అలా ప్రేక్షకురాలిలాగే చూస్తుంది. నేను పనుల వత్తిడిలో పడి తనతో సరిగా టైమ్ స్పెండ్ చెయ్యకపోవడం ఒక్కటే తన ప్రధానమైన కంప్లయింట్. అలాంటి భార్య దొరకడం నిజంగా అదృష్టం.
ఇక చివరిగా అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మా అమ్మమ్మ గురించి చెప్పాలి. తన గురించి అసలు మొదట్లోనే రాయాలి. మా అమ్మమ్మ కర్మయోగి లాంటిది. పొలం వెళ్లి ఒళ్లు హూనం చేసుకుని పనిచేసి ఒళ్లు నొప్పులు భరించలేక ఏది ఏ టాబ్లెట్నో కూడా చూసుకోకుండా, పొట్లంలో ఉన్న ఏదో టాబ్లెట్ రంగుని బట్టి వేసుకునేది. బక్కపలుచుగా ఉండేది. అసలు ఆమె చేసే కష్టం ఊహించలేనిది. ఆమె కడుపు నిండా తిండి తిన్న రోజులు తక్కువ. ఆమె చివరి దశలో కాలు స్లిప్ అయిన తుంటి పట్టేసి, కదలలేని స్థితికి వెళ్లింది. అప్పటి నుండి చనిపోయే క్షణం వరకూ మంచం మీదే. ఏళ్ల తరబడి పడుకోవడం వల్ల ఏర్పడే పుళ్లు తట్టుకోలేకపోయేది. “అమ్మా, అయ్యా” అని మూలిగేది. ఆమె మంచంలో అటూ ఇటూ తిరగలేకపోతే నేనో, ఉమక్కనో, ఎవరో ఒకళ్లం అటూ ఇటూ భుజం పట్టుకుని తిప్పాలి. కొన్నిసార్లు ఏదో చిరాకులో అలాంటి చిన్న సాయం కూడా ఆమెకి నేను చెయ్యలేదు.. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అమ్మమ్మా. మా అమ్మమ్మ పేరు వజ్రమ్మ. ఆమె పేరులాగే ఆమె నిజమైన వజ్రం.
మా కుటుంబంలో అందరూ బొద్దుగా ఉంటారు. నేను ఒక్కడినే సన్నగా ఉంటాను, మా అమ్మమ్మలాగే. “నీకు వజ్రమ్మ సాలు వచ్చింది, నీలా ఉంటే ఎంత బాగుంటుందో” అని మా అక్క వాళ్లు తరచూ అంటుంటారు.
ఇక నా పిల్లల సంగతి.. చాలామంది తరచూ అడుగుతుంటారు, మీకు ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారు అని! నాకు పిల్లలు లేరు. మా మిసెస్‌కి గైనిక్ ఇష్యూ వల్ల 2011 ప్రాంతంలో ఐవిఎఫ్‌కి వెళ్లాం. ప్రెగ్నెన్సీలో ఏడవ నెల తనకి ఫ్లూయిడ్ లెవల్ తగ్గిపోయి, విపరీతమైన బిపి వచ్చి లోపల ఆడపిల్ల (తర్వాత తెలిసింది) బ్రెయిన్ నుండి దాదాపు అన్ని ఆర్గాన్లు దెబ్బతిన్నాయి. డాక్టర్లు అబార్ట్ చెయ్యడం మంచిది అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అబార్ట్ చేయించాం.
ఆరోజు ఉమక్కా నేనూ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి ఏడ్చిన సంఘటన ఇప్పటికీ నా కళ్ల ముందు ఉంది.. తండ్రి ఉన్నా లేనట్లే, తండ్రివి అయి ఆ ప్రేమని పంచుతావునుకుంటే అదీ అవలేదు” అంటూ ఉమక్క అంటుంటే కళ్లమ్మట నీళ్లు వచ్చాయి. భారతికి అడాప్ట్ చేసుకోవడం, సరోగసీ లాంటివి ఇక ఆసక్తి లేకపోవడంతో ఇద్దరమే ఒకరికొకరం ప్రేమగా ఉంటున్నాం.
ఇవన్నీ తలుచుకున్నప్పుడే నాకు స్పిరిట్యువాలిటీ భావనలు వస్తాయి. నాకు బలమైన ఏ బంధాలనూ దేవుడు సృష్టించలేదు. ఈ భూమ్మీదకు వచ్చాక నా పని నేను, నా బాధ్యత నేను చేసుకుని వెళ్లేలాగే నా జీవితం, భారతి జీవితం కొనసాగింది తప్పించి, భూమ్మీద అతుక్కుపోవాలని, మనుషుల్ని వదిలిపెట్టకూడదు అనే మమకారం ఈ జీవితం మీద ఏర్పడలేదు. అలాగే నేను చిన్నప్పటి నుండి పడిన కష్టాలు జీవితం, మనుషులు, సమాజం అంటే ఏమిటో అర్థమయ్యేలా చేశాయి. ఇలాంటి జీవితం చూశాక స్పిరిట్యువల్‌గా మారకుండా ఎలా ఉంటాను? నా గమ్యం అదైనప్పుడు!
అత్యంత ముఖ్యమైన మరో వ్యక్తి గురించి రాయాలి. ఆ వ్యక్తి వల్లనే నాకు జీవితం తెలిసింది.. సందర్భానికి తగ్గట్లు ఆ వ్యక్తి గురించి రాస్తాను.
- Sridhar Nallamothu