నేను చాలా మొద్దుని! టెన్త్ క్లాస్ వరకూ మ్యాథ్స్ అర్థమయ్యేవి కాదు. సైన్స్ బట్టీ పెట్టి ఏదో రాసేవి వచ్చే వాడిని. సోషల్ ఒక్కటి చాలా బాగా రాసేవాడిని. తెలుగులో మంచి మార్కులు వచ్చేవి. ఏదో పాసయ్యాం అంటే పాసయ్యాం అనే తరహాలో నెట్టుకుని వచ్చే వాడిని.
పర్చూరులో ఇంటర్మీడియెట్ CECచేరాక మొట్టమొదటిసారి చదువుపై ఆసక్తి కలిగింది. పక్కనే ఉండే ఉప్పుటూరు నుండి పూర్ణ మాస్టార్ అని ఒకాయన నేనుండే నాగులపాలెం వచ్చి అకౌంట్స్ ట్యూషన్ చెప్పేవారు. రకరకాల ఆవర్జాలు, బ్యాలెన్స్ షీట్ వంటివి వేయడం, బ్యాలెన్స్ షీట్ సరిపోలకపోతే ఎక్కడ తప్పు ఎంట్రీ జరిగిందో వెదికి సరిచేసి, గొప్పగా అనుభూతి చెందడం చాలా బాగుండేది.
ఆ తర్వాత బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో బి.కాం చేరాను. రోజూ మా జమ్ములపాలెం నుండి బాపట్ల ప్రైవేట్ బస్‌లో కాలేజీకి వెళ్లి రావడం! మా ఊరికి బస్ కోసం కనీసం గంటన్నర వెయిట్ చేయాలి. బాపట్ల పాత బస్డాండ్‌లో ఓ మూలన ఓ టీ సెంటర్ ఉంటుంది. అక్కడ అలాగే గంటలు గంటలు నిలబడేవాడిని, వచ్చే పోయే వాళ్లని చూస్తూ! కాళ్లు గుంజేసేవి. ఒక కాలు నుండి, మరో కాలికి సపోర్ట్ మార్చుకుంటూ అలా క్షణాలు యుగాలుగా గడిచేవి. కొన్నిసార్లు నా వల్ల కాకపోతే దగ్గరలో ఉండే శాఖా గ్రంధాలయానికి వెళ్లి చదువుకునే వాడిని. అలా వెళ్లాలంటే ఎక్కడ బస్ మిస్ అవుతానో అని ధైర్యం చేసే వాడిని కాదు.
కొన్నిసార్లు ప్రైవేట్ బస్‌లు రిపేర్ అయి దొరక్కపోతే మా ఊరి బయట ఉండే మెయిన్ రోడ్ కెళ్లి పెదనండిపాడు నుండి వచ్చే ఆర్టీసి బస్సులు ఖాళీ లేకపోతే వెనుక నిచ్చెన ఎక్కి టాప్ మీద కూర్చుని బాపట్ల చేరుకున్న సందర్భాలెన్నో! బాపట్ల నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు.. కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, యోజన లాంటి అన్ని రకాల కాంపిటీటివ్ బుక్స్ తెచ్చుకునే వాడిని. అవి చదువుతుండగా మొట్టమొదటి సారి మన బ్రెయిన్ పవర్ మెరుగుపరుచుకోవచ్చు అన్న విషయం తెలిసింది.. CSRలో “మైండ్ పవర్ స్టడీ టెక్నిక్స్” అని రాజ్ బాప్నా బుక్ గురించి ఓ ప్రకటన పడింది. వెంటనే మా ఊళ్లో పోస్ట్ మ్యాన్ “భారీ” (ఆయన పేరే అది) ద్వారా MO చేయించుకుని రాజస్థాన్ నుండి అనుకుంటా ఆ బుక్ తెప్పించుకున్నా.
మైండ్ మ్యాప్‌ల గురించి, ఫాస్ట్ రీడింగ్ గురించి ఆ వయస్సులోనే తెలుసుకున్నాను. నేను చదివే అన్ని కాన్సెప్టులు మైండ్ మ్యాప్‌లు గీసుకునే వాడిని, వాటిని హైలైట్ చెయ్యడానికి కలర్ పెన్స్ తెచ్చుకునే వాడిని. IAS అవ్వాలి అనేది అప్పట్లో నా బలమైన కోరిక. అందుకే జనరల్ స్టడీస్ మీద విపరీతమైన పట్టు ఉండేది.
జమ్ములపాలెంలో మా ఇంటి ముందు వరండాలో సాయంత్రం నాలుగు నుండి మంచం వేసుకుని రాత్రి 7, 8 గంటల వరకూ “సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్, అత్యధిక వర్షపాతం ఉండే ప్రదేశం చిరపుంజి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ హైదరాబాద్‌లో ఉంది” అనుకుంటూ కళ్లు మూసుకుని బట్టీ పెట్టే వాడిని.
లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) మొదలుకుని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ పీనల్ కోడ్ లాంటి.. ఇదీ అదీ అని లేకుండా అన్ని పుస్తకాలూ సెకండ్ హ్యాండ్లో కొని చదువుకునే వాడిని. బాపట్ల షరాఫ్ బజార్ మూల మీద ఉండే ఓల్డ్ బుక్‌స్టాల్ అతనికి నేను బాగా గుర్తు. ఐపీసిలో కోడిని దొంగతనం చేస్తే ఎంత శిక్ష పడుతుంది లాంటివి చదివి నవ్వుకునే వాడిని. వాటినీ బట్టీ పెట్టే వాడిని. మేగజైన్స్ కొనే అలవాటులో భాగంగా ఓసారి ఉద్యోగ విజయాలు పత్రిక కొన్నాను. అందులో విజయవాడకి చెందిన మోడరన్ అకాడమీ డైరెక్టర్ సుంకర పాపారావు గారి ఇంటర్వ్యూ పడింది. ICWAIకి మంచి భవిష్యత్ ఉందని దాని సారాంశం. సివిల్స్, IAS ఆలోచన వదిలేశాను. ICWAI చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. డిగ్రీ పూర్తయితే ICWAIకి ఎంట్రన్స్ అవసరం లేదు. కానీ డిగ్రీ పూర్తి కాలేదు. సుబ్బయ్య తాతయ్యకి విజయవాడ వెళ్లి ఎంట్రెన్స్ రాస్తానని ఒప్పించి.. వెళ్లి కోచింగులో చేరాను. ICWAI ఎంట్రన్సులో మేథ్స్ కూడా ఓ సబ్జెక్ట్. నాకు మ్యాధ్స్ రాదు. కానీ అక్కడ పాపారావు గారి దగ్గర ఆయన పేరు తెలీదు గానీ ఒక లెక్చరర్ మ్యాధ్స్ బోధించిన విధానం ఆ తర్వాత దాన్ని నా ఫేవరెట్ సబ్జెక్ట్ చేసింది. ఇంత ఈజీనా అన్పించింది.
పాపారావు గారి దగ్గర డిగ్రీ సెకండియర్ ప్రైవేటుగా చేస్తూ ICWAI ఇంటర్ (అప్పటికే ఎంట్రెన్స్ పాసయ్యాను) కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. స్వాతి మాస పత్రిక ఎడిటర్ వేమూరి బలరాం గారి కుమార్తె వేమూరి మణిచందన నా బ్యాచ్‌నే. హాస్టల్లో రూమ్ ఖాళీ లేకపోవడంతో పాపారావు గారు సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ ఎదురు గల్లీలో కొండకు దగ్గరలో ఉండే తాను ఉండే ఇంట్లో ఓ రూము మాకు ఇచ్చారు. పాపారావు గారికి అప్పటికే ఐదారు డిగ్రీలు ఉన్నాయి. ఆయనకి చదువుకోవడం వ్యసనం. రోజూ రాత్రి డిన్నర్ చేసి మాతో పాటు మా పక్కన వచ్చి నేల మీద కూర్చుని పుస్తకాలు ముందేసుకుని చదవుకునే వారు. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆయన లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా చదువుకోవచ్చు అని అప్పుడు గ్రహించాక, జీవితంలో ఏ దశలోనూ నేను నేర్చుకోవడం ఆపలేదు. ఇప్పటికీ నేను రకరకాల ఆన్లైన్ కోర్సులు చేస్తూనే ఉంటాను. నోట్స్, మైండ్ మ్యాప్స్ తయారు చేసుకుంటూనే ఉంటాను. పాపారావు గారు మీరు నాకు మార్గదర్శకులిగా నిలిచిన వారిలో ఒకరు. చాలా సంతోషం సర్.
చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్య పాపారావు గారితో కాంటాక్టులోకి వచ్చాను. ఆయన ఇప్పటికీ నన్ను చాలా అభిమానిస్తారు. నేను టివిలో కన్పించినప్పుడల్లా “నిన్ను చూస్తున్నా శ్రీధర్” అంటూ మెసేజ్ చేస్తారు. ఇప్పుడు టిడిపి అధికార ప్రతినిధిగా ఉన్న జివి రెడ్డి కూడా ఆయన శిష్యుడే. జివి రెడ్డి నేను కలిసి టివి డిబేట్ చేసినప్పుడు పలు సందర్భాల్లో పాపారావు గారి గురించి మాట్లాడుకుంటాం.
ICWAI ఇంటర్ కొద్ది మార్కులతో తప్పిపోయింది. పాపారావు గారి దగ్గర మానేసి అప్పుడే విజయవాడ రేడియో స్టేషన్ దగ్గర సూపర్ విజ్ సంస్థని మొదలుపెట్టిన గుప్త గారి దగ్గరకు వెళ్లాను. నేను ఓ స్టూడెంట్‌ని అయినా ఆయన నన్ను ఓ స్నేహితుడిగానే భావించే వారు. క్లాసు అయ్యాక వెళ్లి కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసే వాళ్లం. నేను మైండ్ మ్యాప్స్, ఫాస్ట్ రీడింగ్ లాంటి విధానాలు అనుసరించడం చూసి అప్పటికే ఆయనకి వాటిపై అవగాహన ఉండడంతో నన్ను ప్రత్యేకంగా చూసే వారు. అలా చనువు ఏర్పడింది. ఆయన CAకి తగ్గట్లు సిలబస్ చెప్పేవాళ్లు. నేను రాస్తున్నది ICWAI దాంతో గ్రూపు పోయింది. రిజల్ట్స్ వచ్చాక వెళ్లి నా అక్కసు వెళ్లగక్కాను.
మిగతా మరో ఆర్టికల్‌లో!
- Sridhar Nallamothu