“ఏం ఉలుకూ లేకుండా పలుకూ లేకుండా అలా కూర్చుంటావేం, ఆ సిగిరెట్లేంది, ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ ఏంది, నువ్వెట్లా బాగుపడతావురా” – వరుసకి మామయ్య అయ్యే చేయెత్త కొట్టబోయారు. అంతలోనే కోపాన్ని నియంత్రించుకుని ఆగిపోయారు.
అమ్మమ్మ చనిపోయినప్పుడు నేనే తలకొరివి పెట్టడానికి మిగిలి ఉన్నది. అప్పటికే మా తాతయ్యకీ, మా అమ్మకి తలకొరివి పెట్టాను అమ్మకి నా పదవ తరగతిలో, తాతయ్యకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో!
అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. కానీ బంధువులంతా ఒకదగ్గర చేరతారు, కోప్పడతారు అనే భయం కొద్దీ మా ఊరిలో కాకుండా బాపట్లలో ఓ స్నేహితుడి రూమ్‌లో కూర్చుని ఏకాంతంగా గడిపాను. నేనెక్కడ ఉన్నానో వెదికి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లి నా గురించి పంచాయితీ పెట్టారు అందరూ! అప్పటికి పెళ్లయిపోయిన ఇద్దరు అక్కలు తప్పించి నాకెవరూ లేరు.
మా కజిన్ అయిన అన్నయ్య, మా పెద్దమ్మలు ఇద్దరు, మా నాన్న, మా బాబాయి, ఇందాక చెయ్యెత్తబోయిన మామయ్య, ఇంకో ఇద్దరు ముగ్గురు నవ్వారు మంచం మీదా, కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. నా అలవాట్ల గురించి నిలదీస్తుంటే నేనేం మాట్లాడలేకపోయాను.
ఇప్పటికీ ఆ అనుభూతి అలాగే సజీవంగా నా మనస్సులో ఉంది.. “నేనంటే నా అలవాట్లు కాదు కదా, నా శరీరాన్నీ, నా మనస్సునీ నేను కష్టపెట్టుకుంటున్నాను తప్పించి ఎవరికీ ఏ హానీ చెయ్యడం లేదు కదా, వీళ్లందరికీ నన్ను అనే హక్కు ఎవరిచ్చారు” అని బలంగా అనుకున్నాను ఆ క్షణం. అందుకే బదులివ్వలేదు.
ఇలాగైతే లాభం లేదు, వీడి బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి అని అప్పటికప్పుడు నన్ను ఎవరు పంచుకోవాలో నిర్ణయించుకోవడానికి ఉపక్రమించారు. మొత్తానికి మా నాన్న నన్ను కర్నూలులో ఆయనకి తెలిసిన స్నేహితుడి ఫర్టిలైజర్ షాపులో అకౌంటెంట్‌గా పెడతానని తీసుకెళ్లారు. కర్నూలు సీడ్ బిజినెస్ చేస్తుండే వారు అప్పటికి మా నాన్న. ఇంతకుముందు రాసినట్లు ఆయనతో నాకు ఎలాంటి బలమైన అనుబంధం చిన్నప్పటి నుండీ లేదు. ఆ క్షణం అలా జరిగిపోయింది అంతే. ఆయనా, మా పిన్ని అక్కడ ఉన్నంత కాలం ప్రేమగా చూసుకున్నారు.
ఐదారేళ్ల క్రితం దాదాపు 2015లో అనుకుంటా.. అప్పట్లో నా మీద చెయ్యెత్తబోయిన మామయ్య హైదరాబాద్‌లో మా ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుని “ఇటురా శ్రీధర్” అని పక్కన కూర్చోబెట్టుకుని, “ఎంత ఎత్తుకు ఎదిగిపోయావురా, ఇప్పుడు టివిల్లో నిన్ను చూపించి మా వాడు అని గొప్పగా చెప్పుకుంటున్నాం, ఆరోజు ఎందుకు చెయ్యెత్తానో నాకే అర్థం కాలేదు, మనస్సులో పెట్టుకోకు” అంటూ కళ్లమ్మట నీళ్లతో అంటుంటే.. అప్పుడూ ప్రేక్షకుడిగానే చూశాను. నా ప్రమేయం లేకుండా నా జీవితం ఏదో శక్తితో అలా నడుస్తూ ఉంది.
“నువ్వు జీవితంలో బాగుపడవురా” దాదాపు 2008 ప్రాంతంలో అనుకుంటా మా నాన్న గారు శపించారు. అలా శపించడానికి కారణం ఉంది.
మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు అన్నాను కదా. ఆయన రెండో అమ్మాయి, చిన్న చెల్లెలు గృహప్రవేశానికి నన్ను పిలుస్తూ ఆయన కాల్ చేశారు.
మాకెవరూ లేకపోవడంతో చిన్నప్పుడే చాలా కష్టాలు పడడంతో నేనూ నాకంటే ముందు ఉన్న ఇద్దరు అక్కలూ ముగ్గురం ఒకటే మాట అనుకున్నాం. ఎవరైనా మమ్మల్ని ఫంక్షన్‌కి పిలవాల్సి వస్తే ముగ్గురినీ పిలిస్తేనే వెళదామని కలిసికట్టుగా అనుకున్నాం.
అందుకే మా నాన్నని అడిగాను “పెద్దక్కకి చెప్పారా నాన్నా” అని!
“లేదు, ఎవర్నడిగి రెండో పెళ్లి చేసుకుంది. మాకెవరూ ఏం చెప్పనప్పుడు మేం ఎలా పిలుస్తాం” అన్నారు.
“మీకు చెబితే ఒప్పుకునే వారా” అన్నాను.
“వేరే కేస్ట్ సంబంధం చేసుకుంటే ఎలా ఒప్పుకుంటాను” అని బదులిచ్చారు. “ఇలా మీరు ఒప్పుకోరనే తను ఎవరికీ చెప్పలేదు.” అన్నాను.
మా పెద్దక్క హజ్బెండ్ చనిపోతే రెండో పెళ్లి చేసుకుంది. ఆ విషయంలో ఆయన పట్టింపుగా ఉన్నట్లు అర్థమైంది. ఇంత అడిగిన ఆయన నా పెళ్లికి కూడా రాలేదు.
సరే నేను వెంటనే అన్నాను.. “నేను కడుపులో ఉండగానే ఎవరికి చెప్పి మీరు రెండో పెళ్లి చేసుకున్నారు. మీరు చేస్తే కరెక్ట్, భర్త చనిపోయి మీ కూతురు చేస్తే తప్పా” అన్నాను. దాంతో ఆయనకి చాలా కోపం వచ్చి “నువ్వు జీవితంలో బాగుపడవురా” అంటూ శపించారు.
నేనన్నాను.. “మీ ఆశీస్సులు, మీ శాపాలు నాకు తాకవులే నాన్నా, మీరు ఊహించిన దానికన్నా ఆలోచనల్లో నేను ఉన్నతంగానే ఉన్నాను” అని ఫోన్ పెట్టేశాను.
నా చిన్నప్పుడు అంతా నా చుట్టూ దెప్పిపొడుపులు, ఎగతాళి ఇలా నెగిటివ్ ఎనర్జీనే చుట్టుముట్టి ఉండేది. ఎంత శూన్యాన్ని చూశాక, నిండా మునిగాక ఇంకా పోయేదేముంది, పోతే పోనీయ్.. నన్నేం కదిలిస్తుంది, నా శూన్యపు మనస్సులో ఇంకా పోవడానికి, బాధపడడానికి ఏముంది” అనే భావన ప్రతీ క్షణం ఉండేది.
అప్పటి నుండి ఇప్పటి వరకూ బంధువుల పెళ్లిళ్లలో మా నాన్న గారు నేను ఎదురెదురు పడినా నేను “నాన్నా బాగున్నారా” అనడం, “నువ్వెలా ఉన్నావు, అమ్మాయి ఎలా ఉంది, అప్పుడప్పుడు టివిల్లో చూస్తుంటాను” అని ఆయన అనడం ఓ ప్రహసనం అలా సాగుతూ ఉంది.
నాకు జీవితంలో ఒకటే అర్థమైంది.. నేను పుట్టినప్పటి నుండి ఈరోజు వరకూ నా చుట్టూ వందలు, వేల మంది వచ్చారు. ఎవరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, ఎందుకు వస్తారో, ఎందుకు పోతారో ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇదంతా ఓ తోలుబొమ్మలాట అన్పిస్తుంది. మనుషుల్ని చూసి పొంగిపోకుండా, లేరని కుంగిపోకుండా.. అలా ఐ విట్నెస్ చేస్తూ సాగుతోంది జీవితం.
- Sridhar Nallamothu