Stepping Stones… వాటిని ఎక్కుతున్న మనిషి ఫొటోని చూస్తే మనం చాలా ఇన్స్పైర్ అవుతాం..
అందరికీ అందనంత స్థాయికి చేరిపోయి.. రాజసంతో క్రిందికి చూడాలన్నది మన ఊహల్లో తరచూ కదలాడే ఆశ..
అందుకే చాలామంది అంటూ ఉంటారు… “నాకంటూ ఓ రోజు వస్తుందని..”!
అప్పటివరకూ ఎదురొన్న అవమానాలూ, చులకనభావాలూ, కసీ మొత్తం ఆ ఒక్క రోజు ఒక్క కాన్ఫిడెంట్ చూపుతో washout చేయాలన్న బలమైన కోరిక!
———————–
ఎదగడం కరెక్టే.. ఎదగాలనుకోవడమూ కరెక్టే… కానీ ఎలా ఎదగాలన్నదే అస్సలైన పాయింట్!
కార్లూ, కోట్లూ, సూట్లూ.. ఖరీదైన డ్రెస్సింగ్ స్టైల్ వల్ల ఉట్టిపడే రాజసం.. మనిషి నడిచి వెళ్తుంటే తలతిప్పి చూసేలా ఉండాలన్నది చాలామంది ఆశ.. అందులో గమ్మత్తు ఉంటుంది.. కొంత మత్తూ ఉంటుంది 🙂 కొన్నిసార్లు ఖరీదైన డ్రెస్సులు వేసుకున్నప్పుడు నన్ను చూసి నేనే మురిసిపోయాను… జనాలూ ఏదో గ్రహం నుండి ఊడిపడిన వ్యక్తిలా చూడడమూ గమనించాను… అందుకే ఇది మత్తు అన్నాను.. ఈ మత్తుకి చాలామంది బానిసలు.
—————-
కెరీర్లో ఎదగడం, సోషల్ స్టేటస్ పెరగడం ఎదుగుదలకు అందరూ తీసుకునే ప్రమాణాలు… “బ్రతికితే అలా బ్రతికి చూపించాలి” అనుకుంటారు.. రేయింబవళ్లూ కష్టపడీ, కొన్ని లౌక్యాలూ, కొన్ని ప్రణాళికలు, తెలివితేటలూ రంగరించి మొత్తానికి నేల మీద నుండి నింగికి చేరిపోతారు!!
—————
అయిపోయింది…. మనం కోరుకున్న హోదా వచ్చేసిననట్లే… గౌరవమూ, మందీ మార్భలపు భరోసా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది… అక్కడే కొత్తదనం మిస్ అవుతుంది, అసంతృప్తి మొదలవుతుంది!
ఇంకే చేయాలో అర్థం కాక.. ఎక్కడకు ఎదగాలో అంతుపట్టక చాలామంది మానసికంగా స్ట్రుగుల్ అవుతుంటారు. ఎవరికీ అర్థం కాని, వర్ణించలేని అసంతృప్తి అది!
చూసేవాళ్లంతా “ఆ మనిషికేం… చాలా గొప్పోడు.. చాలా మంచి పొజిషన్లో ఉన్నాడూ..” అనుకుంటారు గానీ… ఒట్టిదే.. ఆ మనిషి ఎంత అసంతృప్తిగా రగిలిపోతుంటాడో…
——————-
చకచకా కెరీర్, సోషల్ స్టేటస్ మెట్లు ఎక్కేయడం ఈజీనే.. కాళ్లల్లో ఓపిక ఉంది కాబట్టి! అందులో మనం గర్వపడేటంత గొప్ప కూడా ఏం లేదు. కొద్దిగా మన మనస్సుని ఆవరించిన మోహాన్ని పక్కకు లాగి చూస్తే.. మన చుట్టూ మనకన్నా ఎక్కువ సాధించేసిన మనుషులు కన్పిస్తుంటారు..
కెరీర్, సోషల్ స్టేటస్ల్లో ఎదిగినంత సులభంగా మానసికంగా ఎదగలేం..
———————–
యెస్ నిజంగానే మనిషి మానసిక ఔన్నత్యాన్ని విస్మరించి మిగతా అన్ని విధాలుగా ఎదగాలనుకుంటున్నాడు..
అవతార్ సినిమా గుర్తుండే ఉంటుంది.. ఒక ఫ్లవర్ని వేలితో పట్టుకుంటే మిగతా అన్ని ఫ్లవర్స్ ముడుచుకుపోతాయి.. అంటే వాటికి మధ్య ఇంటర్లింక్ ఉందన్నమాట.. అదే మాదిరి ఇంటర్లింక్ మనుషులందరి మనస్సుల మధ్యా ఉంది.
మనిషిగా ఎదిగే క్రమంలో మానసికంగా ఎప్పుడైతే కుంచించుకుపోతున్నామో అప్పుడే మిగతా మనస్సులూ మన మనస్సుకి దూరంగా జరిగిపోతూ, కుంచించుకుపోతూ.. మన intersectionని తప్పించి, ఇతర మనుషులతో ఉన్న intersectionsని బలిష్టం చేసుకునేలా దూరంగా జరిగిపోతుంటాయి.
ఈ ప్రాసెస్ మనకు ఒక పట్టాన అర్థం కాదు. అలాగే దీని గురించి ఆలోచించడం కూడా మీనింగ్లెస్ అన్పిస్తుంది. కెరీర్, సోషల్ స్టేటస్ మోహం మనల్ని కమ్మేసినప్పుడు!!
——–
కానీ నిలువుగా ఎదిగాల్సించి ఆగిపోయాక.. ఇంకా ఎదగడానికి ఏం మిగలకపోయాకా.. మనస్సులో అడ్డంగా భారీ శూన్యత ఆవరించేస్తున్నప్పుడు మొదలవుతుంది ఆ అసంతృప్తి!!
ఎందుకు మనుషులకు దూరంగా ఉన్నామో, ఎందుకు మనుషులు మనం ఎంత ఆరాటపడినా గౌరవంగానో, గొప్పగానో దగ్గరకు రావడం తప్పించి ప్రేమగా రాలేకపోతున్నారో అంతుపట్టనప్పుడు మొదలవుతుంది… కళ్ల దగ్గర ఓ చిన్న కన్నీటి చుక్క.. మెలమెల్లగా అది ప్రవాహంలా మారుతుంది..
చకచకా ఎదిగెళ్లే క్రమంలో మానసికంగా ఎదగకపోవడం వల్ల, మనస్సులో పెంచుకున్న ఇరుకు స్వభావాలూ, లక్షణాల వల్లా ఏర్పడిన అగాధాలు ఇవి… ఓ పిడుగు భూమ్మీద పడితే ఎంత గొయ్యి పడుతుందో అంత గోతులు మనం మనషుల మనస్సుల్ని ఛిద్రం చేసుకుంటూ పైకెళ్లే క్రమంలో గమనించలేకపోయినవీ… మన మనస్సులో అలాగే పూడ్చలేనివిగా మిగిలిపోయినవీ!!
——————-
శోకించీ, బాధపడీ ఉపయోగం ఏమిటి? మనం క్రిందకు దిగాలేం, మనల్ని ఓదార్చడానికి ఎవరూ అంత పైకి రానూ లేరు.
అటు ఆకాశంలో కలిసిపోయే తరుణం కోసం వేచి చూడడం తప్పించి.. అంతవరకూ శూన్యంలోకి సుదీర్ఘంగా చూస్తూ పైకి సంతోషాన్ని ప్రదర్శించడం తప్పించి లాభమేముంది?
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply