
“అవీ ఇవీ ఎన్నెన్నో షేర్ చేస్తుంటాం, ఒక రెండు నిమిషాలు వెచ్చించి ఇది చదివి షేర్ చేయండి.. కొందరి జీవితాలు కాపాడండి” – ఇలాంటి ఎమోషనల్ రిక్వెస్టులు సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. పోతే పోయింది రెండు నిమిషాలే కదా అని చదవటం మొదలు పెడతాం. కథ చాలా బాగుంటుంది. అది నిజమో కాదో తెలియదు కానీ మనలో మానవత్వం పరిమళిస్తుంది. వెంటనే షేర్ చేస్తాం. ఇక్కడ మన ప్రధానమైన మోటో మనం షేర్ చేయడం వల్ల ఎవరి జీవితమో కాపాడబడుతోంది అన్న ఓ సానుభూతి!
“ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడంటే..” అంటూ ఓ టైటిల్‌తో యూట్యూబ్‌లో ఓ వీడియో కన్పిస్తుంది. అసలు ఆ వీడియో చేసిన వాడు జీవితంలో పవన్ కళ్యాణ్ మొహం కూడా నేరుగా చూసి ఉండడు. ఆ నోటా ఈ నోటా విన్న గాసిప్స్‌ని వాయిస్ ఓవర్ చేసి, ఓ పది ఫొటోలు ట్రాన్సిషన్ ఎఫెక్టులతో ఓ వీడియోగా చేసి, పవన్ కళ్యాణ్ మనసు లోకి వెళ్లి తొంగి చూసి వచ్చినంత డ్రమెటిక్‌గా చెప్పేస్తూ ఉంటాడు. అదేదో మనకు చాలా కావలసిన విషయం అన్నట్లు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటాం.
ఒక మనిషి జీవితంలో అతి ముఖ్యమైన సమయాన్ని హైజాక్ చేయడం కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. నేనూ రాస్తుంటాను.. “ఈ వీడియో తప్పక చూసి షేర్ చేయండి” అని! ఇదంతా ఓ టెక్నిక్.. మన సబ్ కాన్షియస్ మైండ్‌ని ప్రభావితం చేయటానికి అందరూ అనుసరించే ఓ స్ట్రేటజీ! “ఆపరేషన్ జరుగుతున్న పేషెంట్‌కి 10 లక్షలు కావాలి. దీపావళికీ, సంక్రాంతికీ తెగ ఖర్చుపెడుతూ ఉంటాం. ఆ ఖర్చులు తగ్గించుకుని కాస్త దానం చేసి మానవత్వం చాటుకోండి” అంటూ కూడా కొన్ని ఎమోషనల్ డైలాగులు కన్పిస్తూ ఉంటాయి. ఇక్కడ హెల్ఫ్ చేయొద్దు అన్నది కాదు నేను చెప్పదలుచుకున్నది. అంతకన్నా ఓ ముఖ్యమైన పాయింట్! పైన చెప్పిన అనేక సంఘటనల్లో ఉన్న ఓ కామన్ పాయింట్! అదే అటెన్షన్ గ్రాబింగ్..!!
తల దించుకొని నీ పని నువ్వు బుద్ధిగా చేస్తున్నప్పుడు, ఎలాగైనా నువ్వు తలెత్తి ఎవడో చెప్పే దాని వైపు టైమ్ వేస్ట్ చేసుకుంటూ చూడాలి. సరిగ్గా దానికోసమే నీకు గేలం వేయబడుతుంది. మిర్యాలగూడ అమృత గురించి నువ్వు స్పందించకపోతే, నిన్ను మానవత్వం లేని వ్యక్తిగా ట్రీట్ చెయ్యడానికి ప్రయత్నిస్తారు. అందరూ మాస్ హిస్టీరియాలో కొట్టుకుపోయే టాపిక్ మీద నువ్వు ఏదో ఒకటి రాయకపోతే… నిన్ను వేస్ట్ ఫెలోగా భావిస్తారు. Yeah… నీ ప్రయారిటీలు నీ కంట్రోల్లో లేవు. నీ టైమ్ నీ కంట్రోల్లో లేదు!
నువ్వు అనుకుంటున్నట్లు నువ్వు స్వేచ్ఛాజీవివి కాదు. ఆ వీడియో చూడమనీ, ఈ వీడియో చూడమనీ నిన్ను ట్రాప్ చేస్తారు. నీకు అవసరం లేని విషయాల మీద కూడా క్యూరియాసిటీ సృష్టిస్తారు. నీ మానవత్వం నిరూపించుకోమని కొన్ని ఛాలెంజ్‌లు విసురుతారు. వీటన్నింటి మధ్యా నిన్ను నువ్వు కోల్పోతావు. చుట్టూ ప్రతీ క్షణం కన్పించే ఈ సోషల్ ట్రాప్లను పూర్తిగా ఇగ్నోర్ చేసి, నీ పని నువ్వు బుద్ధిగా చేసుకోవాలంటే చాలా కమిట్మెంట్, ఆలోచనల్లో స్పష్టతా, ఎవరేమనుకున్నా సాగిపోయే దృక్పధం కావాలి.