
ఏదైనా సాధించినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉంటామని చాలా మంది భావిస్తూ ఉంటారు. వాస్తవానికి అఛీవ్మెంట్ అనేది తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది. దాని ద్వారా లభించే సంతోషం మాయమైన తర్వాత మళ్లీ ఏదో సాధించడం కోసం పరుగు పెట్టాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, “ఏదైనా సాధించడం” అనేది మనకు మనం ఎదగడం కోసం ఉపయోగపడుతుంది తప్పించి అది సంతోషానికి కేరాఫ్ అడ్రస్ కాదు. మరి అలాంటప్పుడు సంతోషం ఎలా లభిస్తుంది?
చిన్న శ్వాస!
ఒకే ఒక బలమైన శ్వాస.. మెదడులోకి ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా పంప్ చెయ్యబడి, అప్పటివరకు మనసులో ఉన్న గందరగోళం మొత్తం మాయమయ్యేలా ఒక్క బలమైన శ్వాస చాలు, మీలో ఉన్న ఒత్తిడి మాయం కావటానికి, పరోక్షంగా ఆ వత్తిడి మాటున దాగి ఉన్న సంతోషం తిరిగి రావడానికి! చాలామందికి అర్థం కాని విషయం మన శ్వాస మన సంతోషానికి చాలా సందర్భాల్లో కారణమవుతుంది. గుండె నిండా ఊపిరి తీసుకుంటే వచ్చే కాన్ఫిడెన్స్‌లో మన సంతోషం దాగి ఉంటుంది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన వంటి అనేక రకాల నెగిటివ్ అంశాల క్రింద మన సంతోషం కప్పేయబడి ఉంటుంది. దాన్ని రిలీవ్ చెయ్యడానికి అప్పుడప్పుడు బలంగా శ్వాస తీసుకుని హోల్డ్ చేసి, వదిలిపెట్టడం సహాయపడుతుంది. అందుకే ప్రాణాయామం గురించి అంత గొప్పగా చెబుతారు.
ఈ క్షణం మిమ్మల్ని ఏదైనా వేరే ఆలోచన డామినేట్ చేస్తుంటే, బలంగా ఒక శ్వాస తీసుకోండి. దాన్ని నిట్టూర్పు అనుకోండి ఇంకోటి అనుకోండి.. నిజంగా ఆ ఆలోచన అవసరమా లేదా, ఆ విషయంలో మీరు చేయగలిగింది ఏమిటి వంటి పలు అంశాల మీద క్లారిటీ వస్తుంది. అది చాలు, ఒత్తిడి తగ్గి పోయి సంతోషం తిరిగి రావడానికి!
బాగా వినండి!
వినడం ఎవరైతే తగ్గిస్తారో వారు ఎప్పుడూ అశాంతిగా ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుటి వ్యక్తి మాటలు వినే ఓపిక కోల్పోతున్నారు. ఎదుటి వ్యక్తి ఏదైనా చెబుతుంటే, దాన్ని మెదడులోకి స్వీకరించడం పక్కన పెట్టి, తలాడిస్తూ, తరువాత మనం ఏం మాట్లాడదామా అని సెంటెన్స్లు ఫ్రేమ్ చేసుకుంటున్నారు. మరికొంతమంది అవతలి వ్యక్తి మాట్లాడుతుంటే, వేరే విషయాల గురించి పరధ్యానంగా ఆలోచించడం, అవతలి వారు తమ గురించి ఏమనుకుంటున్నారు అన్నది ఊహించుకోవటం చేస్తూ ఉంటారు. మనసుపెట్టి వినడం అనేది యోగాతో సమానం. మన ఆలోచనలు ఈ క్షణంలో ఉండేలా అలవాటు చేస్తుంది. దీంతో ఫోకస్ లెవల్స్ పెరుగుతాయి. క్రమేపీ అనవసరమైన ఆలోచనలు తగ్గిపోతాయి. ఇది పరోక్షంగా సంతోషానికి దారితీస్తుంది.
దృష్టి ఇలా..
మీరు గమనించారో లేదో గంటల తరబడి మీరు ఫోకస్డ్గా ఒక పని చేస్తున్నప్పుడు, కొద్దిసేపటికి దాంట్లో పూర్తిగా లీనమై పోతారు. బయట ప్రపంచం గురించి అసలు ఆలోచించరు. అది అద్భుతమైన స్థితి. దాంట్లో లభించే సంతోషం మాటల్లో వర్ణించలేనిది. సరిగ్గా ఇదే నియమాన్ని అన్నిచోట్లా అప్లై చేయండి. మీ కళ్లు ఏం చూస్తున్నాయో దాన్ని తప్పించి మిగతా ప్రపంచాన్ని అప్పటికప్పుడు మర్చిపోండి. అలాగే మీరు ఏమి చదువుతున్నారో మనసులో అది మాత్రమే ఉండాలి. కళ్లతో చూసే ఏ విషయమూ మరీ ఎక్కువగా విశ్లేషించవద్దు, జడ్జ్ చేయొద్దు, కేవలం కళ్ళ ఎదుట జరిగే విషయాలకు సాక్ష్యంగా చూస్తూ ఉండండి. దాంతో మీ విశ్లేషణ, దాని ద్వారా వచ్చే మీ కంక్లూజన్ మీ మనసును చెడగొట్టకుండా ఉంటుంది. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు, ఏదో హడావిడిగా కడుపు నింపుకోవడం కాకుండా, దాని టేస్ట్‌ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తూ పూర్తి ఫోకస్డ్గా తినండి. చాలామందికి కడుపునిండా తినడం వలన సంతృప్తి వస్తుంది. కానీ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటే నాలుగు ముద్దలు తిన్నా చాలా సంతృప్తి గా అనిపిస్తుంది.
ప్రకృతికి దగ్గరగా..
రోజూ రాత్రి 12, 1, 2 గంటలకు పడుకుని ఉదయం 8, 9 గంటలకు లేచి హడావిడిగా ఆఫీస్‌కి పరిగెత్తడం కాకుండా, కొద్దిగా ప్రకృతికి దగ్గరగా జీవించండి. కనీసం ఉదయాన్నే సూర్యకాంతిలో కొద్దిసేపు గడపడం, పార్కులు వంటివి ఉంటే వాటిలో వాకింగ్ చేయడం, అప్పుడప్పుడు వర్షంలో తడవడం, చలికాలం చలిని కొద్దిసేపైనా మనస్ఫూర్తిగా ఆస్వాదించడం.. ఇవన్నీ పరోక్షంగా మనల్ని ప్రకృతికి దగ్గర చేస్తాయి. ఇప్పుడు మనం చాలా మంది భావిస్తున్నట్లు ప్రకృతి మన శత్రువు కాదు. ప్రకృతి నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సినంత భయమేమీ లేదు. మనం ప్రకృతికి దూరంగా ఉండటం వల్లే దాన్ని చూసి భయపడాల్సి వస్తోంది.
లక్ష్యాలు
చాలామంది జీవితం నిర్జీవంగా ఉండటానికి ప్రధాన కారణం వారికి తగినంత లక్ష్యాలు లేకపోవడం! ఉదాహరణకు ఈ ఆర్టికల్ రాసేటప్పుడు, ఇది ఎంతమంది ఉపయోగించుకుంటారు అనేదానికన్నా “ఇది నా భావవ్యక్తీకరణను మెరుగుపరుస్తుంది, ఇలాంటివి ఇక వీలున్నప్పుడల్లా రాయాలి” అన్న భావన నన్ను డామినేట్ చేసింది. అందుకే దీన్ని చాలా సంతోషం గా రాస్తున్నాను. ఇలా చిన్నవో పెద్దవో, కొన్ని పర్పస్‌లు, లక్ష్యాలు నిర్దేశించుకొని వాటి కోసం పని చేస్తూ పోతే కచ్చితంగా ఆనందం సొంతమవుతుంది. అలా కాకుండా ఆ పని చేస్తే మనకేం వస్తుంది అన్న లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మన ఆనందాన్ని మనం చేజేతులా దూరం చేసుకున్నట్లే! కొన్ని ఆనందాలు నిస్వార్ధంగా పనిచేయడం వలన వస్తాయి.. ఆనందం కోసం స్వార్ధంగా పనిచేసి, డబ్బులు కూడపెట్టుకొని, వాటిని ఖర్చు పెట్టడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందాల్సిన ఖర్మ మనకు అవసరం లేదు!