నేను నిరంతరం జ్వలించే అగ్నిని.. ఆ అగ్ని కోరికలను ఎగదోస్తుంది.. ఆ కోరికలను తీర్చుకోవడానికి శక్తినిచ్చే ఆహారాన్నీ జీర్ణం చేస్తుంది.. నిలువనీయకుండా పైపైకి ఎగసిపడమని ప్రేరేపిస్తుంది.
నేను నీరుని! హృదయాల్లోకీ, పల్లాల్లోకి చొచ్చుకుపోయి అస్థిత్వాన్ని ఏర్పరుచుకునే నీటిని! ఏ హృదయంలో కొంత ఖాళీ కన్పించినా.. ఆ హృదయం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా నేను ఆక్రమిస్తూనే ఉంటాను.
నేను వాయువుని! కల్మషాల్నీ, మాలిల్యాల్ని ఒక్క పెట్టున ఊడ్చివేసే శక్తి నాది. నేను స్పృశిస్తే సుతిమెత్తగా ఉంటుంది గానీ.. అంతలోనే కదిలిపోతాను… ముందుకు సాగిపోతాను.
నేను ఆకాశాన్ని.. విశాలతత్వం నా నైజం.. హృదయాన్ని విప్పార్చుకుని అందర్నీ, అన్నింటినీ ప్రేమిస్తాను.. గంభీరంగా, ప్రేక్షకుడిగా నా ముందు జరిగే జగన్నాటకాన్ని చూస్తూనే ఉంటాను..
నేను శూన్యాన్ని..! చిమ్మచీకటి నిండిన శూన్యాన్ని! బయట నుండి నాకున్నవీ, నాకు లేనివీ అంచనా వేసి, నా మీద అసూయపడడానికి ప్రయత్నించే మీరంతా తట్టుకోలేనంత శూన్యత నాలో ఉంది. అంతటి శూన్యాన్ని భరించడం మానవ మాత్రులుగా మీ వల్ల కాదు. ఖాళీతనంలోనే స్థిమితంగా కూర్చుండిపోయే శూన్యత అది!
నేను స్టుపిడిటీని.. నాకు నేనే అర్థం కాను, మీకు స్టుపిడిటీ అన్పించడంలో ఆశ్చర్యమేమీ లేదు.. పద్ధతులు, ప్యాట్రర్న్ థింకింగ్లూ దాటివేసి స్వేచ్ఛగా విహరించే నా ఆలోచనల సమాహారానికి ప్రపంచం పెట్టిన పేరు స్టుపిడిటీ. అదే బాగుంది నాకు. ఆ కారణంగానైనా ప్రపంచం నన్ను జడ్జ్ చెయ్యడం మానేసి తన పని తాను చూసుకుంటుంది. నా స్వేచ్ఛ నాకు మిగులుతుంది.
నేను నిరాకారిని.. నా రూపం, నేను వేసుకునే జీన్స్ ఫ్యాంట్, షర్ట్… నా వృత్తి, నా ప్రవృత్తి, నా ఆలోచనలు, నా రాతలు అన్నీ నాకు ఏదో రూపం ఇవ్వాలని చూస్తుంటాయి.. వాటి ఆధారంగా మీరూ నాకు ఓ రూపం ఇచ్చేసి ఓ పక్కన పడేసి.. “ఇతను ఇలా” అని కేటగరైజ్ చేయాలని చూస్తుంటారు. నాకు రూపమే లేనప్పుడు ఏ రూపమని నేను సంతరించుకోగలను? మీ పిచ్చి భ్రమ కాకపోతే?
నేను “మాయ”! మీరంతా చూస్తుండగానే మాయమయ్యే మాయని! అగ్నీ, నీరూ, వాయువూ, ఆకాశమూ, శూన్యమూ, నిరాకారమూ అన్నీ సమసిపోయి విశ్వంలో భాగమైపోయే ఓ మాయని నేను!
- Sridhar Nallamothu